Sep 23,2023 21:16

పోరు షురూ

ఉపాధ్యాయ ఉద్యమం ఉదృతరూపం దాల్చనుంది. జిల్లా వ్యాప్తంగా యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో జిపిఎస్‌ వద్దు.. ఒపిఎస్‌ అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయలోకం నినదిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వైసిపి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఒపిఎస్‌ స్కీమ్‌ను అమలు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని కోరుతూ ఉపా ధ్యాయలు నాలుగున్నరేళ్లుగా ఉద్యమి స్తున్నారు. మాట తప్పను.. మడమ తప్పను అనే ప్రచారంతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన అంశాన్ని ఉపాధ్యాయులు గుర్తుచే స్తున్నారు. అడగని జిపిఎస్‌ను అమలు చేయాలని ఒత్తిడి చేస్తుండడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో సిపిఎస్‌ను అమలు చేస్తామని ఇచ్చిన హామీని నమ్మి ఓట్లు వేయడంతో రికార్డు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతిని గుర్తు చేస్తోంది. 2024 స్వార్వత్రిక ఎన్నికల్లో సిపిఎస్‌ హామీని అమలు చేయాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం ఎన్నికల అజెండాగా మార్చడంలో సఫలమైన ఉపాధాయయ సంఘాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో సుమారు 12 వేల మందికిపైగా ఉపాధ్యాయులు ఉన్నారు. గతేడాది నిర్వహించిన చలో విజయవాడ జయప్రదమైన సంగతి తెలిసిందే. ఇటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఉపాధ్యాయ శ్రేణుల్లో రగిలించాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సంఘాలపై ఉంది. జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐకమత్యంతో ఉద్యోగుల హక్కుల్ని పోరాడి సాధించుకోవాలి. ఇటువంటి తరహాలోనే కార్మిక, కర్షకుల హక్కుల పోరాట సమయాల్లో శ్రమశక్తులు సంఘీభావాన్ని ప్రకటిస్తూ కార్మిక, కర్షక, హక్కులను సాధించుకోవడానికి దోహదం చేయాలి. శ్రమశక్తులన్నీ సంఘటితమైతేనే పాలక వర్గాలు దిగివచ్చి వాస్తవంలో జీవించే అవకాశం ఉంది. లేనిపక్షంలో కార్మిక, కర్షక, ఉద్యోగుల శ్రమను దోచుకుని ఆశాశ హర్య్మాల్లో విహరిస్తూనే ఉంటారు. మోసపోయిన వాళ్లు మోసపోతూనే ఉంటారు. లబ్ధి పొందే పరాన్న బుక్కులు శ్రమటోర్చ కుండానే బోక్తలుగా మారి సోమరులుగా తయారవుతూనే ఉంటారు. పోరాటాల ద్వారానే కార్మిక, కర్షక, ఉద్యోగుల హక్కులు సాధించ బడతాయనేది చరిత్ర రుజువు చేసిన సత్యం. శ్రమశక్తుల్లో ముఖ్యంగా ఉద్యోగుల్లో చైతన్యం పాలు అధికం. ఇటువంటి ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై తమ హక్కులను సాధిం చుకునే అంశంలో ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యతను గుర్తెరిగి మసలుకోవాలి. మానవజాతి వికాస పరిణామాల్ని పరిశీలిస్తే చరిత్ర నిండా పోరాటాలు, సంఘర్షణలే ఉన్నాయని తెలుస్తోంది. వీటి ఆధారంగానే మానవజాతి వికాసం, సామాజిక, సాంస్కృతిక పురోగతి సాధించిన ఘట్టాలు సాక్ష్యాలుగా నిలిచిన సంగతిని గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- ప్రజాశక్తి-కడప ప్రతినిధి