ప్రజాశక్తి - సంతబొమ్మాళి: మూలపేట అదానీ పోర్టు ఆర్ అండ్ ఆర్ కాలనీ కోసం గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్ ఢకొీని సంతబొమ్మాళికి చెందిన తంగి గణపతికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన సంతబొమ్మాళి గ్రామస్తు గ్రావెల్ తరలిస్తున్న పోర్టు వాహనాలను మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు ఆగిపోవడంతో పాలేశ్వరస్వామి ఆలయం నుంచి సంతబొమ్మాళి ఎంపిడిఒ కార్యాలయం వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోర్టు వాహనాలు నిత్యం సంతబొమ్మాళి గ్రామంలో రాకపోకలు సాగిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఎన్నిసార్లు చెప్పినా డ్రైవర్లు అతివేగంతో వాహనాలను నడుపుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని కూడలిలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ వేగంగా నడపడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. పలుమార్లు వాహన డ్రైవర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని, అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సంతబొమ్మాళి ఎస్‌ఐ కె.మధుసూదనరావు డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చినా తీరు మారలేదని చెప్పారు. ఇలాగే కొనసాగితే పోర్టు వాహనాలను గ్రామంలో తిరగనీయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.










