ప్రజాశక్తి - కలెక్టరేట్ : విశాఖపట్నం పోర్టు అథారిటీ వారు పోర్టులోని బెర్తులను, ఆసుపత్రిని, స్టేడియంను, గ్రౌండ్స్‌ను.. ఇలా మొత్తం పోర్టు స్థలాలన్నింటినీ ప్రయివేటు కంపెనీలకు లీజు పేరుతో కట్టబెట్టడాన్ని వెంటనే ఆపాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు డిమాండ్ చేశారు. శనివారం జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా విస్తృత సమావేశం ఎస్.జ్యోతీశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్, ప్రయివేటు కంపెనీలకు కారుచౌకగా కట్టబెడుతోందన్నారు. ఇప్పటికే బ్యాంకులు, ఇన్సూరెన్స్, రైల్వేలు, విమానాశ్రయాలు, చమురు సంస్థలను, రక్షణ రంగంతో పాటు వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేస్తోందన్నారు. తాజాగా పోర్టులోని బెర్తులన్నింటితో పాటు పోర్టుకు ఉన్నటువంటి ఆసుపత్రిని, కళావాణి ఆడిటోరియంను, క్రీడా స్థలాలను, కల్యాణ మండపాలను, డిసిఐ పాత భవనాలను, స్కూళ్లను లీజు పేరుతో అతి చౌకగా ప్రైవేటువారికి ఇవ్వడం అన్యాయమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు. పోర్టు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య అవసరాల కోసం 1984లో పోర్టు గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రిని పోర్టు యజమాన్యం ఏర్పాటు చేసిందన్నారు. ఇది ఉచిత సేవలందిస్తూ ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. కరోనా సమయంలో ఆపద్బాంధవిగా నిలిచిందన్నారు. అటువంటి ఆసుపత్రిని పిపిపి పద్ధతిలోకి తీసుకువెళ్తామని ఛైర్మన్ చెప్పడం దుర్మార్గమన్నారు. ఇంకా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసి ఆధునిక వైద్యం అందేలా చేయాలన్నారు. పోర్టు ఆసుపత్రిని ప్రైవేటుపరం చేస్తే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్, అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్, పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు, శ్రామిక మహిళా నాయకురాలు పి.మణి తదితరులు ఈ ప్రైవేటీకరణ చర్యలను ఖండించారు.










