Aug 01,2023 22:51

పోలీసు బందోబస్తు మధ్య పర్యటిస్తున్న సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి

ప్రజాశక్తి - నౌపడ: సంతబొమ్మాళి మండలం మూలపేటలో పెండింగ్‌లో ఉన్న 36 పిడిఎఫ్‌ (ప్రాజెక్ట్‌ డిస్ప్లేస్‌ ఫ్యామిలీ)పై టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌ రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. పోర్టు నిర్వాసితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. పోలీసు బందోబస్తు నడుమ ఇంటింటికీ వెళ్లి బాధిత పిడిఎఫ్‌ కుటుంబాలతో సబ్‌ కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు మాట్లాడారు. మూలపేటలో సొంత ఇళ్లు ఉన్నాయా?, ఎప్పట్నుంచి గ్రామంలో నివసిస్తున్నారు?, గ్రామాన్ని విడిచి ఎందుకు వలస వెళ్లాల్సి వచ్చింది? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆధార్‌, రేషన్‌కార్డులను పరిశీలించారు. ఉపాధి లేకపోవడం, పిల్లలు చదువుల కోసం ఇతర గ్రామాలకు వలస వెళ్లిపోవాల్సి వచ్చిందని పలువురు గ్రామస్తులు చెప్పారు. గ్రామంలో సొంత ఇళ్లు, భూములు ఉన్నాయని, వీటి కోసం ఏటా ఇక్కడకు వచ్చి నెలల పాటు గ్రామంలో ఉంటున్నామని తెలిపారు. వీటన్నింటినీ పరిశీలించి అందరికి న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని సబ్‌ కలెక్టర్‌ హామీనిచ్చారు. టెక్కలి డిఎస్‌పి బాలచంద్రారెడ్డి ఆధ్వర్యాన టెక్కలి సిఐ చంద్రమౌళి, టెక్కలి, సంతబొమ్మాళి, నౌపడ, కోటబొమ్మాళి, నందిగాం ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది భారీ సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు. పోలీసు బలగాల మధ్య సబ్‌ కలెక్టర్‌ పర్యటన చేపట్టి 36 పెండింగ్‌ పిడిఎఫ్‌ కుటుంబాల విచారణ చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.