ప్రజాశక్తి - కలెక్టరేట్, సీతమ్మధార : విశాఖపట్నం పోర్టుకు చెందిన గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి, ఇతర విలువైన కట్టడాలను, ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను విడనాడాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్, విడిఎల్‌బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు విఎస్.పద్మనాభరాజు డిమాండ్ చేశారు. పోర్టు ఆస్తులను ప్రయివేటుకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం పోర్టు యూనియన్ల ఆధ్వర్యంలో జిజెహెచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పోర్టుల్లో తెచ్చిన సంస్కరణలలో భాగంగా నేషనల్ మోనటైజేషన్ పైపులైన్ స్కీం పేరున బెర్తులను, స్థలాలు, కల్యాణ మండపాలు, కళావాణి ఆడిటోరియం, స్టేడియంలు, జిజె హాస్పిటల్‌ను ప్రయివేటుపరం చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిపారు. కైలాసపురం క్వార్టర్స్ ప్రాంతంలో ఇప్పటికే సుమారు 17 ఎకరాల స్థలాన్ని గజం రూ.800 చొప్పున ఇచ్చేసారన్నారు. ఇంకా 30 ఎకరాలను ఇచ్చేయడానికి కోట్లు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్నారన్నారు. పోర్టు ఆసుపత్రి 40 వేల మంది పోర్టు కార్మికులు, ఆఫీసర్లు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న కన్నతల్లి వంటిదని తెలిపారు. పిపిపికి 43 లక్షల రూపాయలకు కన్సల్టెంట్ ఇచ్చేసారని చెప్పారు. ఇప్పటికే నిధులు సరిగ్గా కేటాయించక వైద్యం అంతంత మాత్రంగా అక్కడ ఉందన్నారు. ఇప్పుడు ప్రైవేటు వారికి ఇచ్చేస్తే.. వారు లాభం గురించి చూస్తారు తప్ప బాధ్యతగల వైద్యంపై దృష్టి పెట్టరన్నారు. భవిష్యత్తులో పోర్టు ఉద్యోగులకు పూర్తి వైద్య సదుపాయం ప్రశ్నార్థకమేనన్నారు. కాబట్టి తల్లిలాంటి జిజెహెచ్‌ని పిపిపికి ఇవ్వరాదన్నారు. ఏళ్ల తరబడి పోర్టు కార్మికుల కష్టంతో సమకూర్చుకున్న ఆస్తులను అమ్మడం అన్యాయమన్నారు. పోర్టుల ఆస్తులను పోర్టుల అభివృద్ధికి ఉపయోగించాలని, సొంత నిధులతోనే కీలకమైన యాంత్రీకరణ చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కె.స్వతంత్ర కుమార్, యూనియన్ అధ్యక్షులు సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శి కె.సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్.త్రినాథరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.రామలింగేశ్వరరావు, విడిఎల్‌బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బి.లక్ష్మణరావు, జక్కాన సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










