Feb 17,2023 23:56

భారీ ర్యాలీ చేపడుతున్న కాఫీ రైతులు, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: కాఫీ ప్రోత్సాహక బకాయిలు చెల్లించే వరకూ పోరాటం అగదని పలువురు నాయకులు వెల్లడించారు. కాఫీ బకాయిలు చెల్లించాలని
కాపీ రైతులు శుక్రవారం ఐటిడిఏను ముట్టడించారు. గిరిజన సంఘం కార్యాలయం నుంచి గిరిజన రైతులు ర్యాలీగా ఐటీడీఏకు తరలి వెళ్లి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ...గత ఐదేళ్లలో చేపట్టిన కాఫీ ప్రాజెక్ట్‌ ద్వారా రైతులకు చెల్లింపులు చేయని ప్రోత్సాహక సొమ్ము బకాయిలను పోరాడి రాబడతామని వెల్లడించారు. బకాయిలు చెల్లించే వరకు ఈ పోరు ఆగదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌ కాపీ రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలికి లక్కు మాట్లాడుతూ రెండున్నర లక్షల ఎకరాల్లో లక్షన్నర మంది గిరిజనులు కాఫీ సాగు చేస్తున్నా నేటికీ ఆర్థిక స్థోమతను పెంచుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. రైతులకు రూ.60 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాఫీ బకాయిలు చెల్లించక పోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి బకాయిలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఐటిడిఏ పిఓ ప్రకటించిన కొత్త కాపీ ప్రాజెక్టు లో ఒక ఎకరా కాఫీ సాగుకి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం కేటాయించాలని డిమాండ్‌ చేశారు.
అనంతగిరి జడ్పిటిసి సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ, ఐటీడీఏ ద్వారా వచ్చే ఏడాది నుంచి కొత్తగా చేపట్టే కాఫీ ప్రాజెక్ట్‌ ప్రణాళికలో గిరిజన రైతులకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. రైతుల అవసరాలను, ప్రయోజనాలను గుర్తించి వారి అభిప్రాయాలను తెలుసుకొని ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాఫీ రైతుల సంఘం జాతీయ నాయకులు గేమ్మెలి చినబాబు (సుంకరమెట్ట సర్పంచ్‌) వివిధ మండలాల ఏపీ గిరిజన సంఘం నాయకులు ఎంఎం శ్రీను, పృథ్విరాజ్‌ ,పాంగి ధనుంజరు, బుజ్జి బాబు (ఎంపిటిసి), కొండలరావు, కృష్ణారావు, సూర్యనారాయణ, ధర్మన్నపడాల్‌, చిట్టిబాబు, భాస్కర్‌ రావు (త్రినాథ్‌), నరసయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు.