ప్రజాశక్తి - గుంటూరు : ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సాధనకు ఆశ వర్కర్లు పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి పిలుపునిచ్చారు. ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో కె.లక్ష్మి అధ్యక్షతన ఆదివారం జరిగింది. నేతాజి మాట్లాడుతూ ఆశ వర్కర్లకు వేతనాలు పెంచామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అలవిగాని పనిభారాన్ని మోపి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని విమర్శించారు. ఫలితంగానే రాష్ట్రంలో ఇటీవల ఇద్దరు ఆశ వర్కర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తున్నారని, రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఏమీ లేకుండా 60 ఏళ్లకు రిటైర్మెంట్ చేస్తున్నారని అన్నారు. రిటైర్మెంట్ అనంతరం ఆశా వర్కర్ల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తవుతున్నా ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాలైన అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశ తదితర పథకాల కార్మికులకు ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని, కాకులను కొట్టి గద్దలను మేపుతున్న విధంగా మోడీ పాలన ఉందని మండిపడ్డారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జ్యోతి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు సెలవుల సౌకర్యం లేదని, నిర్దిష్టమైన పని గంటలు లేవని, అన్ని పనులూ అధికారులు పైస్థాయి ఉద్యోగులు ఆశా వర్కర్లపై నెట్టి వెట్టిచాకిరి చేయిస్తున్నారని అన్నారు. యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఐక్యమై ప్రతిఘటించడం ద్వారానే హక్కులను కాపాడుకోగలరని పిలుపునిచ్చారు. సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు స్వర్ణకుమారి, టి.ధనలక్ష్మి, డి.పద్మావతి, కె.శ్యామల పాల్గొన్నారు.










