Jul 21,2023 23:11

దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతున్న తేజేశ్వరరావు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: మున్సిపల్‌ కార్మికులకు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే దశలవారీ పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.బలరాం, నగర అధ్యక్షులు అరుగుల గణేష్‌ హెచ్చరించారు. మున్సిపాలిటీలోని ఆప్కాస్‌ కార్మికులందరినీ వెంటనే రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సిపిఎస్‌ రద్దు చేయాలని నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యాన మున్సిపల్‌ కార్మికులు రిలే నిరాహార దీక్ష శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఈ దీక్షను తేజేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. క్లాప్‌ డ్రైవర్లకు నెలానెలా జీతాలు చెల్లించాలన్నారు. దశల వారీ ఆందోళనలో భాగంగా ఈ నెల 27న మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 7న కలెక్టరేట్లు ముట్టడిస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. దీక్షా శిబిరంలో కె.లలిత, ఎం.లక్ష్మి, పి.మలమ్మ, డి.దేవి, టి.వెంకటలక్ష్మి, జి.ధనలక్ష్మి, ఐ.రాజ్యలక్ష్మి, రాము, డి.చిట్టిబాబు, కళ్యాణం, రాజు, మోహన్‌, జనార్థన్‌ పాల్గొన్నారు.
పలాస : కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద పారిశుధ్య కార్మికులు చేపట్టిన దీక్ష, ధర్నా కొనసాగింది. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు సిహెచ్‌.మురగన్‌, రమేష్‌, శంకర్‌, భాస్కరరావు, రాము, సీతమ్మ, ఉష పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం : మున్సిపల్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షులు రమేష్‌ పట్నాయక్‌ ఆధ్వర్యాన మున్సిపల్‌ కార్యాలయం వద్ద కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. ఆప్కోస్‌లో ఉన్న వారందరినీ రెగ్యులర్‌ చేయాలని నినాదాలు చేశారు.
ఆమదాలవలస : మున్సిపల్‌ కార్యాలయం వద్ద చేపడుతున్న పారిశుధ్య కార్మికుల రిలే దీక్షలకు సిఐటియు మండల నాయకులు పంచాది లతాదేవి, అంగన్వాడీ సెక్టార్‌ యూనియన్‌ అధ్యక్షులు పి.భూలక్ష్మి, పారిశుధ్య కార్మిక నాయకులు టి.సంతోష్‌, జె.వాసు, శ్రీను, నీలయ్య పాల్గొన్నారు.