Nov 19,2021 06:07

'కార్మికుల హక్కులను కాపాడుకోవడం, సమస్యలను పరిష్కరించుకోవడం పోరాటాల తోనే సాధ్యం. కర్నాటక లోని బిజెపి ప్రభుత్వం ఉద్యమాలపై అడుగడుగునా ఉక్కుపాదం మోపుతున్నది. చిన్నపాటి ధర్నా చేయాలన్నా సవాలక్ష కండిషన్లు. ఒకవేళ అనుమతించినా అడుగడుగునా అడ్డగింతలు. అరెస్టులు, కేసులతో బెదిరింపులు. ఇదీ మా రాష్ట్రం లోని పరిస్థితి. అయినా, మేం ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. పోరాటాలనూ వీడలేదు. 'భూ కైదే' (భూ సంస్కరణల సవరణ చట్టం)కి, పని గంటలు పెంచడానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం ద్వారా బిజెపి సర్కారు మెడలు వంచి విజయం సాధించాం. కరోనా విపత్తునూ కమ్యూనిస్టులు, ముస్లింలపై నెట్టి రాజకీయ ప్రయోజనం పొందే కుట్రకు బిజెపి పూనుకున్నది. కార్మిక శాఖ నుంచి అందాల్సిన సహాయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా పంపిణీ చేసి క్షేత్ర స్థాయిలో బలపడేందుకూ యత్నిస్తున్నది. దీన్ని కూడా మేం ఐక్య ఉద్యమాలతో ఎదుర్కొంటున్నాం' అని కర్నాటక సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌. వరలక్ష్మి చెప్పారు. హైదరాబాద్‌లో సిఐటియు జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా నవ తెలంగాణ ప్రతినిధికి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...

కరోనా విపత్తు వేళ కర్నాటకలో కార్మికుల పరిస్థితి ఏమిటి?
కర్నాటక లోని పరిశ్రమల్లో సంఘటిత రంగమే ఎక్కువ. బెంగళూరు సిటీ కి ఎక్స్‌పోర్ట్‌లో మంచి పేరుంది. కరోనాతో చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. విపత్తు వల్ల కార్మికులు పనికి రాలేని పరిస్థితి ఉంటే యాజమాన్యాలు వేతనాలను నిరాకరించాయి. అది వర్కర్ల తప్పిదం కాదు.. ప్రకృతి విపత్తు కాబట్టి పూర్తి వేతనం ఇవ్వాలని పోరాడాం. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాడాం. దీంతో కార్మికులను తొలగించవద్దు..పూర్తి వేతనాలు ఇవ్వాలని కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత రెండు రోజులకే పరిశ్రమల యాజమాన్యాలు అప్పటి సీఎం యడ్యూరప్ప మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఆదేశాలను వెనక్కి తీసుకునేలా చేశాయి. దక్షిణాసియా లోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన పినియా ఇండిస్టియల్‌ ఏరియాలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. చిన్నచిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. అదే సమయంలో కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరించాయి. వేతనాలు తక్కువగా ఇస్తాం.. చేస్తే చేయండి, లేకపోతే లేదు..బెనిఫిట్లు అడగొద్దు.. పని కావాలంటే నోరు మూసుకుని పని చేయాల్సిందే..ఇచ్చినంత తీసుకోవాలి..ఇలా సవాలక్ష ఆంక్షలు పెడితే..వాటికి వ్యతిరేకంగా సిఐటియు గా నికరంగా నిలబడి పోరాడాం. చాలా పరిశ్రమల్లోనూ కార్మికులకు పూర్తి వేతనాలు అందేలా చూశాం.


ఇటీవల సిఐటియు సాధించిన ముఖ్యమైన విజయాలను వివరిస్తారా....
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు తెచ్చినట్టుగానే యడ్యూరప్ప సీఎం గా ఉన్న సమయంలో భూ సీలింగ్‌ను ఎత్తివేసింది. దీంతో ఎవరైనా ఎంత భూమినైనా కలిగి ఉండే అవకాశాన్ని బిజెపి కల్పించింది. 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచుతూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. 'భూ కైదే' చట్టం వద్దని, పని గంటలను పెంచొద్దని సిఐటియు పెద్దఎత్తున పోరాటం చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్షాలంతా ఒక్కటై సర్కారు మీద ఒత్తిడి చేసేలా సిఐటియు కృషి ఫలించింది. దాని ఫలితంగా సర్కారు ఈ రెండింటి విషయంలో వెనక్కి తగ్గింది. ఈ రెండు పోరాటాలనూ కీలక ఘట్టాలుగా చెప్పుకోవచ్చు. అయితే, 'భూ కైదే' విషయంలో ఆర్డినెన్స్‌ తెచ్చి ముందుకు పోవాలని చూస్తున్నది. వెనక్కి తగ్గే వరకూ పోరాడుతాం. కరోనా సమయంలో కార్మికులకు నేరుగా నగదు ఇవ్వాలనేది సిఐటియు డిమాండ్‌. దీని వల్ల కొనుగోలు శక్తిపెరుగుతుందని స్టగ్రుల్‌ చేశాం. దీంతో భవన నిర్మాణ కార్మికులు, ఆటోడ్రైవర్లు, ఇంటి పనివారు... తదితరులకు రాష్ట్ర సర్కారు ప్యాకేజీ ప్రకటించింది. కర్నాటక కట్టడ నిర్మాణ కార్మిక మండలి ద్వారా భవన నిర్మాణ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. అయితే, అధికార పార్టీ అంతే ఎత్తున అందులో అవినీతికి పాల్పడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. వలస కార్మికులకు, వీధి వ్యాపారులకు రూ.8 కోట్ల విలువైన ఆహార ప్యాకెట్లను పంచాం.


కరోనా విపత్తును కర్నాటకలో బిజెపి రాజకీయంగా వాడుకుంటున్నది అంటున్నారు. అదెలా?
కరోనా వైరస్‌ వ్యాప్తినీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాలు రాజకీయంగా వాడుకున్నాయి. ప్రభుత్వ పరంగా పేదలకు, కార్మికులకు అందాల్సిన ఫలాలను కూడా బిజెపి అనుబంధ సంఘాల ద్వారా క్షేత్ర స్థాయిలో పంచి ఆ పార్టీ బలోపేతానికి వాడుకున్న నీచమైన పరిస్థితి. చైనా కమ్యూనిస్టులు, ముస్లింలు కరోనాకు కారణమంటూ విష ప్రచారాన్ని వదిలాయి. మీడియాలో ఓ సెక్షన్‌ కూడా బిజెపి కి సపోర్ట్‌గా అసత్య కథనాలు ప్రచురించి బలం చేకూర్చే ప్రయత్నం చేసింది. లాక్‌డౌన్‌ కాలంలో కార్మికులు, ప్రజలు ఇళ్లల్లో ఉండి టీవీలు చూస్తారు కాబట్టి వారి ఎత్తుగడ కొంతమేర సక్సెస్‌ అయింది. సిఐటియు గా ఆ తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కార్మికుల్లోకి వెళ్లాం. కార్మిక శాఖకు చెందిన ఆహార పొట్లాలను ఆర్‌ఎస్‌ఎస్‌తో పంపిణీ చేయించడం దారుణం. ఈ విషయమై ప్రశ్నించాం. ట్రేడ్‌ యూనియన్లకు సంబంధం లేని వారికి ఎలా ఇస్తారని నిలదీశాం. హైకోర్టూ ట్రేడ్‌ యూనియన్ల ద్వారానే ఆ పని జరగాలని ఆదేశించింది. దీంతో బిజెపి సర్కారు వెనక్కి తగ్గింది.


మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్‌వాడీలు, పంచాయతీ కార్మికుల పక్షాన మీరు ఎలాంటి పోరాటాలు చేశారు?
కరోనా సమయంలో అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ కార్మికులు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా పనిచేశారు. 50 మంది అంగన్‌వాడీలు, 80 మంది గ్రామ పంచాయతీ వర్కర్లు చనిపోయితే బిజెపి సర్కారు పట్టించుకోలేదు. సిఐటియు గా ఇతర సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తే ఇప్పుడు వారికి 30 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలవుతున్నది. అది కొందరికే అందింది. అందరికీ ఇచ్చేదాకా పోరాడుతాం. 61 వేల మంది గ్రామ పంచాయతీ వర్కర్లకు కనీస వేతనం అమలవుతున్న ప్పటికీ..ఏడాది నుంచి వేతనాలు ఇవ్వడం లేదు. వీటికోసం పోరాడుతున్నాం. బొమ్మై సీఎం అయ్యాక ప్రమోషన్లకు రిజర్వేషన్‌ తగ్గించి పరీక్షలు రాయాలని సర్క్యులర్‌ తెస్తే మన యూనియన్‌ నాలుగు సార్లు పోరాటం చేసింది. సర్కారు నిర్ణయానికి నిరసనగా పంచాయతీల్లో పనులు ఆపేస్తామని ప్రకటన చేశాక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రెజరీ ద్వారా నేరుగా పంచాయతీ కార్మికులకు వేతనాలు పొందేలా చేయడంలో సిఐటియు పాత్రే కీలకం. వారికి పెన్షన్‌ అమలవుతున్నది. మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇది దారుణం. సీఎం, సీఎస్‌ ను కలిసినా ఫలితం లేకపోవడంతో ఆగస్టులో విద్యాశాఖ మంత్రి ఇంటి ముట్టడికి యత్నించాం. మంత్రి ఆదేశాలతో పోలీసులు దారుణంగా వ్యవహరించారు. హీనంగా ఈడ్చిపడేశారు. 65 మంది మధ్యాహ్న భోజన కార్మికులపై నేటికీ కేసులున్నాయి. అంగన్‌వాడీ వర్కర్లు కరోనా సమయంలో విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వీరిదే కీలక బాధ్యత. పిల్లలు రావడం లేదనడం ఒక్కటే గానీ..సర్వేలు, పథకాల అమలు, వ్యాక్సినేషన్‌, తదితర పనులతో ఇబ్బంది పడుతున్నారు. వారి పక్షాన పోరాడుతున్నాం.