Apr 26,2023 23:57

స్వీట్లు తినిపించుకుంటున్న ముఠా కార్మికులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కార మవుతాయని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌.రాము అన్నారు. రుషిల్‌ డెకార్‌ ప్లైవుడ్‌ పరిశ్రమ ముఠా కార్మికులు 22 రోజుల పాటు పోరాటం చేసి విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం ఆందోళన శిబిరం వద్ద విజయోత్సవం నిర్వహించారు. కార్మికులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ కలిసి ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రుషిల్‌ డెకార్‌ యాజమాన్యంపై ఐక్యంగా పోరాడి విజయం సాధించిన నిర్వాసితులు, ముఠా కార్మికులకు జేజేలు పలికారు. ఏ అన్యాయం జరిగినా ఇదే స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలని కోరారు. ఎస్‌ఇజెడ్‌లో నిర్వాసితులు తమ భూములను కారు చౌకగా ఇచ్చారని, పరిశ్రమలు వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించారని తెలిపారు. కాని నేడు ప్రభుత్వం, యాజమాన్యాలు బయటకు పంపే చర్యలకు పూనుకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పన వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకుల దయాదాక్షిణాలపై కాకుండా ఎపిఐఐసి ట్రైనింగ్‌ సెంటర్‌ ద్వారా భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో అందే సూరిబాబు, కిషోర్‌, చొప్ప వెంకన్న, నానాజీ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.