ప్రజాశక్తి- టెక్కలి రూరల్: ఐక్య పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని, దీనికి సిద్ధం కావాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహయ కార్యదర్శి కొల్లి ఎల్లయ్య పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో టెక్కలి మండలం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు డి.మల్లేష్ అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1934లో నెల్లూరు జిల్లా అలగానిపాడులో అమరజీవి మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి నేటి వరకు పలు శాఖలుగా విస్తరించి దేశంలో కోటికి పైగా సభ్యత్వం కలిగిన అతి పెద్ద సంఘంగా ఎదిగిందన్నారు. వ్యవసాయ కార్మికులకు చేతినిండా పని కల్పించి పనికి తగ్గ కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు మౌలిక సమస్యలైన అందరికీ ఉపాధి, ఇళ్లు, సాగు భూమి, సమానత్వం, సామాజిక న్యాయం, ఆహార భద్రత, విద్య, వైద్యం తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేరుతో ప్రకటించిన పథకాలతో పాటు అర్హులైన పేదలందరికీ మూడు ఎకరాలు భూమి పంపిణీ చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలన్నారు. జాబ్‌కార్డుదారులందరికీ 200 రోజులు పని కల్పించాలని, రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా డి.నీల వేణి, బి.మల్లేష్, మరో పది మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రవి, రాజు, కృష్ణ పాల్గొన్నారు.










