Nov 25,2022 23:38

బోధిస్తున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని చిలకగెడ్డ పంచాయతీ దాసరితోట గ్రామంలో పాఠశాలను తిరిగి పున:ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ పోరాటం ఫలితంగా గిరిజన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందుతుండటంపై సిపిఎం జెడ్పిటిసి దీసరి. గంగరాజు ఆనంద వ్యక్తం చేశారు. పాఠశాల తిరిగి ప్రారంభం అనంతరం సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యా బోధనలపై అడిగి తెలుసు కున్నారు. విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం వంకాయపాలెం గ్రామంలో మండల పరిషత్‌ పాఠశాల ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం కొన్ని ఏళ్ల తర్వాత అక్కడ పాఠశాల మూసివేసి కిలోమీటర్‌ దూరంలో ఉన్న పాఠశాలకు అప్పటి ప్రభుత్వం విలీనం చేసిందని తెలిపారు. దీంతో ఆ గ్రామానికి చెందిన సుమారు 30 మందిపైన విద్యార్థులు గ్రామం నుండి రాకపోకలు సాగిస్తూ చదువులు కొనసాగించడంలో ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో పాఠశాలను తిరిగి మంజూరు చేశారన్నారు. పోరాట ఫలితంగా విద్యాశాఖ అధికారులు గ్రామంలో మూడు నెలల కిందట వచ్చి పరిశీలించి గ్రామసభ అనుమతులతతో చిలకగెడ్డ పాఠశాలలో బోధనను అందిస్తున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టోకురు పంచాయతీ సర్పంచ్‌ కిల్లో మొస్య, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.