రాయచోటి టౌన్ : పోరాటాల ద్వారానే విద్యార్థి హక్కులు సాధించుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ అన్నారు. శనివారం జిల్లా కమిటీ సమావేశం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల్ని దేశంలో ప్రజాస్వామ్యం మాటున నియంతత్వ పోకడలతో ఆటంకం పరుస్తున్నారని చెప్పారు. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొని వస్తున్నారని, అందులోనూ రాజకీయ రంగును రుద్దుడ కుంటూ ఆంక్షలు విధించే విధంగా ప్రభుత్వాల పనితీరు ఎత్తిచూపాలని పిలుపునిచ్చారు. విద్యారంగంలోనూ మతోన్మాదాన్ని ప్రేరోపితం చేసే విధంగా ఉన్న నూతన జాతీయ విద్యా విధానాన్ని బలవంతంగా విద్యార్థులపై రుద్దే ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. దుర్మార్గపు ఆలోచనలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టివేసే జీవో 117ను వెంటనే రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత ప్రగల్బాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. నిత్యం కరువు వలసలతో అల్లాడుతున్న అట్టడుగు ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కడా లేవని వాపోయారు. విభజన హామీల్లో పొందుపరిచిన కడప ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించి పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. మదనపల్లి మెడికల్ కళాశాలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు. అన్నమయ్య జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. విద్యారంగానికి ఉపాధి చేరువ చేస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల విద్యార్థులకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నియంతత్వ ధోరణికి అడ్డుకట్ట వేసేది విద్యార్థులే అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేకుండా ప్రజాస్వామ్య గొంతుకలను కూకటివేలతో నులిమి వేస్తున్నారని తెలిపారు. సామాజిక న్యాయం జరగకుండా విద్యా కాషాయకరణ, విద్యా కార్పొరేట్ సంస్థలకు అమ్మివేస్తూ ఆర్భాటాలు ప్రకటిస్తూ దేశ జీడీపీ శాతంలో ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీ విద్యార్థినుల విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించే మౌలానా ఆజాద్ స్కాలర్షిప్ రద్దును ఉపసంహరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలతో పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షలా చేస్తున్నారన్నారు. యూనివర్సిటీల కేంద్రంగా డిగ్రీ కళాశాలలో ,ఇంటర్ కళాశాలలో ప్రాథమిక పాఠశాలలో, ఫార్మసీ కళాశాలలో, మెడిసిన్ రంగంలో ఇంజినీరింగ్ కేంద్రంలో ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్న పాలక ప్రభుత్వాలకు అవి కనబడక అధికార దాహం కోసం విద్యారంగాన్ని అటకెక్కించారన్నారు. ఉన్నత విలువలతో కూడిన రాజకీయ వ్యవస్థను రాక్షస క్రీడగా మార్చి అగాంతకులను అందలమెక్కిస్తూ విద్యావ్యవస్థను అంగడి సరుకు లాగా డబ్బు ఉన్న వారికే విద్యగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు పోరాటాల ద్వారా హక్కుల సాధించుకోవాలని పాలక ప్రభుత్వాలను పోరాటాల ద్వార మేల్కొల్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సర్వేపల్లి నరసింహ, జిల్లా ఉపాధ్యక్షులు డి.వెంకట రమణ, పి.జాన్ ప్రసాద్, బి.రమణ, బి.తేజ, నరేష్ పాల్గొన్నారు.










