ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్ : మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) ఆధ్వర్యాన చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం విలీన పంచాయతీల కార్మికులను ఆప్కాస్‌లో చేర్చిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం అన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసును శనివారం కార్యాలయంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి దశల వారీ పోరాటాలు చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించక తప్పలేదన్నారు. ఈనెల 10న మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఫెడరేషన్‌తో జరిపిన చర్చల్లో కార్మికులను ఆప్కాస్‌లో చేర్చేందుకు, మృతి చెందిన, రిటైర్ అయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. రానున్న కాలంలో సంఘాన్ని మరింత పటిష్టపరచడానికి మున్సిపల్ పారిశుధ్య, ఇంజినీరింగ్, క్లాప్ డ్రైవర్లను, విలీన గ్రామ పంచాయతీ కార్మికులు, కోవిడ్, వరద ముంపు తదితర పేర్లతో విధులు నిర్వహిస్తున్న కార్మికులందరినీ సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ పోరాటాల వల్ల ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుందన్నారు. కార్మికులంతా క్రమశిక్షణగా పనిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు కళ్యాణ రాజు, శేఖర్, జనార్థన్, ఎ.రాము, డి.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.










