Mar 14,2023 23:03

ప్రజాశక్తి-ఎ.కొండూరు: రైతులు పోరాడితేనే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోగలుగుతామని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కేశవరావు పిలుపునిచ్చారు. మండలంలోని చీమలపాడు గ్రామ సమీపాన ఎస్‌.సోములు మామిడితోటలో మామిడి రైతుల సదస్సు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ మామిడి సాగు రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల్లో ఉండగా ఒక్క ఎన్టీఆర్‌ జిల్లాలోనే లక్ష ఎకరాల్లో సాగౌతుందన్నారు. మామిడి రైతులు గడిచిన మూడు సంవత్సరాలుగా తామర పురుగు, నల్లి వంటి తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మామిడి రైతులను ప్రైవేటు వ్యాపారులు సూటు కమీషన్‌ పేరుతో 25 కిలోల వరకు తీసేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని తెలిపారు. పంటల బీమా మామిడి రైతులకు కూడా వర్తింపజేయాలని, ఉచిత బోర్ల పథకం అమలు చేయాలని, డ్రిప్‌ స్పింకర్ల పరికరాలు 90 శాతం సబ్సిడీపై ఇవ్వాలని, పండ్ల మార్కెట్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని, ఉమ్మడి కృష్ణాజిల్లాలో మామిడి సాగు ఎక్కువగా ఉన్న మండలాల్లో జ్యూస్‌ ఫ్యాక్టరీలు నడపాలని, తెగుళ్ల వల్ల నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని సదస్సులో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి పివి.ఆంజనేయులు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గువ్వల సీతారామిరెడ్డి, ఎ.కొండూరు రైతు సంఘం కార్యదర్శి ఆళ్ల అమ్మిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు పానెం ఆనందరావు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
మామిడి రైతు సంఘం ఎన్నిక
సదస్సులో భవిష్యత్తు కార్యాచరణ, ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై చర్చించిన అనంతరం ఎన్టీఆర్‌ జిల్లా మామిడి రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా సిహెచ్‌ వీరారెడ్డి, కమిటీ సభ్యులుగా మీసాల సత్యం, నాగళ్ల నరసింహారావు, బండి వైకుంఠం, అత్తునూరి రామిరెడ్డి, సోమ యోహాను, వజ్రాల వెంకటరెడ్డి, పాములపాటి సత్యనారాయణ, మద్దిరెడ్డి మాధవరెడ్డి, నెక్కళపు నాగేశ్వరావు, ఆనుమోలు బాబురావు, లక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నువ్వుల కృష్ణారెడ్డితో పాటు 15 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటైంది.