ప్రజాశక్తి - ఏలూరు
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం అఖిలపక్షం నిర్వహించి, కేంద్రంపై పోరాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టిన సమర (బస్సు) యాత్ర మంగళవారం ఏలూరు వచ్చిన సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సభకు డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి కె.నాని అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసగించిందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యార్థులు, యువత హోదా సాధన కోసం నడుం బిగించాలన్నారు. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు మినహా మిగిలిన ఏఒక్క పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చకుండా మోసగించిందన్నారు. నాడు రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కాగానే ప్రత్యేక హోదా విషయం పక్కన పెట్టారన్నారు. బిజెపి మోసగిస్తే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం మౌనం వహించడం దారుణమన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తీరు అలానే ఉందన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహారం, ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు నిధులు తదితర హామీలు కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని యువత హోదా సాధన కోసం ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలపై ఒత్తిడి చేయాలన్నారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ మాట్లాడుతూ ఈ యాత్రకు పిడిఎఫ్ ఎంఎల్‌సిలుగా పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం బిజెపికి భయపడుతుందని, అందుకే హోదా కోసం గట్టిగా పోరాడటం లేదని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ నిత్యావసర ధరల రూపంలో ప్రజలపై పెనుభారాలు మోపుతోందన్నారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ మతవిద్వేషాలను రెచ్చగొడుతూ, రాజ్యాంగానికి తూట్లు పొడిస్తుందని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు హోదా తీసుకొస్తామని చెప్పిన వైసిపి నేడు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు భూషణం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌బాబు, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పళ్లెం కిషోర్, డిఎన్‌విడి ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వరరావు, యు.హేమశంకర్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లెనిన్, జిల్లా ముఖ్య నాయకులు పవన్, సాయి, రంజిత్ మహేష్, వంశీ, ఆనంద్ పాల్గొన్నారు.










