ప్రజాశక్తి -గాజువాక : పోరాటాలు భవిష్యత్తుకు బాట వేస్తాయని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కెఎం.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం నాయకులు ఆవు సీతారామయ్య సంతాప సభ ఆదివారం అరుణోదయ కాలనీలో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కెఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ, అరుణోదయ కాలనీ ఏర్పాటుకు, మౌలిక సదుపాయాల కల్పనకు సీతారామయ్య చేసిన సేవలు సజీవంగా ఉంటాయన్నారు. ప్రజలకు మంచి చేద్దామనే తపనతో సీతారామయ్య ఉండేవారన్నారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే ఆయన ప్రజల కోసం నిత్యం పోరాటం చేశారని తెలిపారు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని కోరారు. సీతారామయ్య కుటుంబానికి సిపిఎం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుందన్నారు.
సిపిఎం గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడుతూ, సీతారామయ్య మరణం పార్టీకి తీరని లోటు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో జిఒ 296 సంబంధించిన పట్టాలు 40 మందికి ఇవ్వలేదని, దానిపై సీతారామయ్య చేసిన పోరాటాన్ని మరవలేనిదన్నారు.
సిపిఎం నాయకులు పివివై.రమణారావు మాట్లాడుతూ, సుందరయ్య కాలనీ, అరుణోదయ కాలనీ, దశమకొండ ఏర్పాటులో సీతారామయ్య కృషిని వివరించారు. సీతారామయ్య కుమారుడు రామకృష్ణ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తనకు తెలియకుండా క్రమశిక్షణతో తండ్రి పెంచారని చెప్పారు. తాను ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా పనిచేస్తున్నానని తెలిపారు. స్థానిక సిపిఎం నాయకులు కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ఐద్వా నాయకులు కె.సంతోషం, పార్టీ నాయకులు నాగేశ్వరరావు, సీతారామయ్య బంధువులు మాట్లాడారు. సభ ప్రారంభంలో సీతారామయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, సభకు హాజరైన బంధువులు, స్థానికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.










