May 14,2023 00:06

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌

ప్రజాశక్తి-కూనవరం
పోలవరం ప్రాజెక్ట్‌ కోసం తమ భూములు, గ్రామాలు, జీవితాలను త్యాగం చేసిన నిర్వాసితులు తమకు జరుగుతున్న అన్యాయంపై పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం ఎఎస్‌ఆర్‌ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ పిలుపునిచ్చారు. మండలంలోని బొజ్జరాయిగూడెంలో వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య అధ్యక్షతన జరిగిన సిపిఎం మండల కమిటీ సమావేశంలో కిరణ్‌ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ళ తరబడి సర్వేలు చేస్తూ నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తేనే ప్యాకేజీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ప్రజలను అయోమయ పరిస్థితిలోకి నెట్టివేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా సర్వేల ద్వారా కాలయాపన చేయకుండా, కాంటూరు లెక్కలు చెప్పకుండా వరదల వల్ల నష్టపోయిన ప్రతి నిర్వాసితునికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మండలంలోని ప్రతి పంచాయితీలో మంచి నీటి సమస్య ఉందని, తాగనీటి ఎద్దడిని నివారించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఈ వేసవిలోనైనా తాగునీటి సమస్య తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, నాయకులు సీసం సురేష్‌, ఎంపీటీసీలు అమ్మాజీ, జయసుధ, సర్పంచ్‌ నాగమణి, ఆవుల ఉపేంద్ర, ఆవుల మురళి, కర్నాటి శ్రీనివాసరావు, నానుపల్లి వెంకటేశ్వరావు, మడకం పొద్దయ్య, జోడే రాజు తదితరులు పాల్గొన్నారు.