
ప్రజాశక్తి-గన్నవరం : ప్రజలు పోరాటాల్లోకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఎం జిల్లా నాయకులు టీవీ లక్ష్మణస్వామి అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికై జరుగుతున్న ప్రజారక్షణ బేరి యాత్ర ను ఉంగుటూరు మండలం పెద్ద ఆవుటపల్లిలో శుక్రవారం ఉదయం పార్టీ సీనియర్ నాయకులు భీమవరపు సుబ్బారెడ్డి పతాకాన్ని ఊపి ప్రారంభించారు. పెదఆవుటపల్లి , ఆత్కూరు, పొట్టిపాడు, ఆనందపురం, పోనుకుమాడు, గారపాడు, ఆముదా లపల్లి, కొయ్య గూరపాడు, లంకపల్లి,ముక్కపాడు, ఇందుపల్లి, నందమూరు, మధిరపాడు, చాగంటిపాడు ,వేంపాడు గ్రామాలలో ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామాలలో జరిగిన సభల్లో లక్ష్మణ స్వామి మాట్లాడుతూ గన్నవరం నియోజక వర్గంలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీలు పల్లంగా వున్నాయనీ రోడ్లు, మంచినీరు, విద్యుత్ వంటి మౌలికమైన వసతులు లేవు అన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న మొత్తం సరిపోవడం లేదనీ 5లక్షల రూపాయలకు పెంచి యివ్వాలన్నారు. కాలనీలు మెరక చేసి మౌలిక వసతులు కల్పించాలన్నారు. డెల్టా గ్రామాలన్నింటిలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారని వారికి కౌలుకార్డులు లేవు అని తెలిపారు. యజమానితో సంబంధం లేకుండా కౌలుకార్డులు ఇవ్వాలని పంట రుణాలు, సబ్సిడి పై ఎరువులు, విత్తనాలు ఇవ్వాలన్నారు. రైతుభరోసా ఇవ్వాలని పంటలు నష్టపోయినప్పుడు నష్టపరిహారం కౌలురైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజక వర్గ పరిధిలోని మిగిలిన సగ భాగం మెట్ట ప్రాంతంగా వుండి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్బికెల ద్వారా ధాన్యం అమ్మితే డబ్బులు ఆలస్యంగా వస్తున్నవని నేటికీ కాటా, రవాణా ఛార్జీలు రాలేదన్నారు. ఆర్టికెల ద్వారా మద్దతు ధరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి వారంలోగా డబ్బు చెల్లించాలని కోరారు. సిపిఎం జిల్లా నాయకులు కే. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూ పంపిణీలో భాగంగా అనేక గ్రామాల్లో పేదలకు పాస్ పుస్తకాలు, పట్టాలు ఇచ్చారు కాని నేటికీ వారికి భూమి చూపించలేదన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూములన్నింటిని పేదలకు అప్పగించాలని పేదలు సాగు చేసుకుంటున్న భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అత్యధికంగా వున్నాయన్నారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయని ప్రభుత్వం సాయం అందించి పారిశ్రామికంగా అభివద్ధి చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉంగుటూరు మండల కార్యదర్శి అజ్మీర వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు కడవకొల్లు రామరాజు, సలీం, సీతారామరాజు, రాజారావు, శ్రీనివాస్, రామ మోహనరావు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.