ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : సిపిఎం పూర్వ కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కార్యదర్శి సునీత్ చోప్రా, సిపిఎం పూర్వ జిల్లా కమిటీ సభ్యులు, సిఐటియు రాష్ట్ర నాయకులు జి.సుబ్బారావు కార్మిక, కర్షక పోరాటయోధులని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం కొనియాడారు. జగదాంబ సమీపంలోని ఎన్‌పిఆర్ భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కెఎస్‌వి.కుమార్ అధ్యక్షతన బుధవారం సంతాపసభ నిర్వహించారు. సభకు ముందుగా సునీత్‌చోప్రా, జి. సుబ్బారావుల చిత్రపటాలకు కె.లోకనాథం, ఎం.జగ్గునాయుడు పూలమాల వేసి నివాళర్పించారు.
ఈ సందర్భంగా కె.లోకనాధం మాట్లాడుతూ, గుర్గావ్ నుంచి ఢిల్లీకి మెట్రోలో ప్రయాణిస్తుండగా సునీత్ చోప్రా గుండెపోటుతో మరణించారన్నారు. సునీత్ చోప్రా జెఎన్‌యు విద్యార్థి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. ఉన్నత కుటుంబంలో జన్మించిన ఆయన వ్యవసాయ కార్మికుల ఉద్యమానికి అంకితమైన కేడర్‌గా మారారని, భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో వ్యవసాయ కార్మికులను సంఘటిత పరచటంలో ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త కార్యదర్శిగా చాలా కాలం పనిచేశారన్నారు. సునీత్ చోప్రా 1995లో 15వ మహాసభలో సిపిఎం కేంద్ర కమిటీకి ఎన్నికై 2015 వరకు ఆ స్థానంలో కొనసాగారని తెలిపారు.
జి.సుబ్బారావు గాజువాక పట్టణ కమిటీ కార్యదర్శిగానూ, జిల్లా కమిటీ సభ్యునిగా, ఉమ్మడి రాష్ట్రంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారని, తుదిశ్వాస వరకూ ప్రజాసమస్యలపై పోరాడారని కొనియాడారు. కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సుబ్బారావు ఎనలేని కృషి చేశారన్నారు. విద్యార్థి, మహిళా, యువజన ఉద్యమాలకు తోడ్పాటునందించారని తెలిపారు. సునీత్‌చోప్రా, సుబ్బారావు మరణం ప్రజా ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి తీరనిలోటని పేర్కొన్నారు. సుబ్బారావు సంస్మరణ సభ ఈ నెల 12న గాజువాకలో జరుగుతుందని, ఈ సభకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిఐటియు తెలుగు రాష్ట్రాల నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బి.పద్మ, పి.మణి, కెఎం.శ్రీనివాసరావు, పి.పైడిరాజు, వి.కృష్ణారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.










