ప్రజాశక్తి - ములగాడ : ప్రజల మనిషి, పోరాట యోధుడు జి.సుబ్బారావు అని వక్తలు కొనియాడారు. జివిఎంసి కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన సిఐటియు మల్కాపురం కార్యాలయంలో మంగళవారం సంతాపసభ నిర్వహించారు. ముందుగా సుబ్బారావు చిత్రపటానికి జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షులు కె.పెంటారావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో వెంకటరెడ్డి మాట్లాడుతూ, అనుకున్న పని అయినంతవరకు సుబ్బారావు నిద్రపోయేవాడు కాదని పేర్కొన్నారు. జివిఎంసి కార్మికుల సమస్యలే కాకుండా గాజువాక, విశాఖ నగరంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, తాగు నీరు, విద్యుత్, చిరు వ్యాపారుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకూ పోరాడారన్నారు. ఆయన ఆశయాల బాటలో మనమంతా నడుద్దాం అన్నారు.
సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నిరంతరమూ ప్రజా సేవకే అంకితమై ప్రజల మనిషిగా నిలిచారన్నారు. జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మల్కాపురం జోన్ అధ్యక్షులు కె.రమణ, నాయకులు బి.రాంబాబు, డి.రాము, బి.సూరిబాబు, ఎ.తిరుపతిరావు, ఎన్.ఉమ, బి.శ్రీను, రవి, ఏడు వార్డుల జివిఎంసి కార్మికులు పాల్గొన్నారు.










