![](/sites/default/files/2023-11/cpm_26.jpg)
ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్ : సిపిఎం వ్యవస్థాపక నాయకులు శంకరయ్య గొప్ప పోరాట యోధుడని, ఆయన మరణం కార్మిక, రైతు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు, అతను ఆశయాలు కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. మండలంలోని అడ్డాపుశీల పంచాయతీ బంటువానివలసలో శంకరయ్య సంతాపం సభ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా శంకరయ్య చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బంటు దాసు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం రెడ్డి వేణు మాట్లాడుతూ శంకరయ్య డిగ్రీ చదువుతూ విద్యార్థి దశలోనే బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, శతాబ్ది యోధులు, రైతు ప్రజా పోరాటాల, సామాజిక ఉద్యమ నాయకులని కొనియాడారు. తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా, అఖిల భారత కిసాన్ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా రైతాంగ ఉద్యమాన్ని, సమరశీల పోరాటాలు నడిపిన యోధుడు శంకరయ్య అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితో జిల్లాలో మన ప్రాంతంలోని రైతు, కార్మిక, ప్రజా ఉద్యమాలు నిర్మించాలని, ఆయన ఆశయ సాధనకు అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఇందిర, రైతులు, నిర్వాసిత, యువజన సంఘాల నాయకులు బంటు ఆదినారాయణ, ఎ.కూర్మయ్య, బంటు విజరు, సిహెచ్ శ్రీరాము, శివుని నాయుడు, శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు.