Apr 26,2023 00:21

ఒప్పంద పత్రాలు అందజేస్తున్న కంపెనీ ప్రతినిధులు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
రుషిల్‌ డెకార్‌ ప్లై వుడ్‌ పరిశ్రమలో ముఠా కార్మికులు గత 21 రోజులుగా చేపట్టిన పోరాటం విజయం సాధించింది. కంపెనీ పాత రేట్లు ప్రకారం కూలి చెల్లించడానికి పరిశ్రమ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు పరిశ్రమ పిఆర్‌ఓ శ్రీనివాసరావు, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నాగేష్‌ మంగళవారం నిరసన శిబిరం వద్దకు వచ్చి ముఠా కార్మికులకు తెలియజేశారు. తమకు పాత రేట్లు ప్రకారం కూలి చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పరిశ్రమ వద్ద ముఠా కార్మికులు 21 రోజులుగా నిరాహార దీక్ష విషయం తెలిసిందే. ఈ సమస్య పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యాన దశలవారీగా అనేక ఉద్యమాలు చేపట్టారు. కలెక్టర్‌, మంత్రి అమర్‌నాథ్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌, స్థానిక తహశీల్దారు, ఎమ్మెల్యే కన్నబాబు రాజు తదితరులను కలిసి తమ సమస్యలను వివరించారు. చివరకు సోమవారం ఎమ్మెల్యే కన్నబాబు రాజును కలిసి పరిశ్రమ పిఆర్‌ఓ హెచ్‌ఆర్‌ మేనేజర్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఫలప్రదం కావడంతో మంగళవారం ముఠా కార్మికులు చేస్తున్న నిరసన శిబిరం వద్దకు పరిశ్రమ పిఆర్‌ఓ శ్రీనివాసరావు, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ నాగేషు వచ్చి ముఠా కార్మికులతో మాట్లాడారు. ముఠా కార్మికులతో జరిగిన ఒప్పందం ప్రకారం లారీకి రూ.500, వ్యాన్‌కు రూ.300, ట్రాక్టర్‌కు రూ.200, తార్పతాడు లారీ కడితే రూ.700 ఇస్తామని తెలిపారు. ఈ విషయం లారీ యజమానులకు తెలియజేసి మంగళవారం పాత రేట్లు అమలు చేస్తామని చెప్పారు. దీనిపై సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒప్పందం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్లి నానాజీ, అందే అప్పలనాయుడు, బయలుపూడి రమణ, గుర్రం సూరిబాబు, గొర్లి సత్తిబాబు, తాతారావు, అందే గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.