ప్రజాశక్తి-అనంతగిరి:గిరిజన ప్రజల మనుగడను దెబ్బ తీసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు వ్యతిరేకంగా పెద్దకోట, పినకోట పంచాయతీల పోరాట కమిటీలు తీర్మానం చేసి ఆమోదించాయి. గురువారం పంచాయతీ కేంద్రంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ సభ్యులు నారంగీ. సింహాసనం అధ్యక్షతన రెండు పంచాయతీల అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందరర్భంగా నారంగి. సింహాచలం, సిరిగం. బైరమూర్తి, గొర్లి. ఆనందులు మాట్లాడుతూ, రెండు పంచాయతీ పరిధిలకు ఆనుకుని ఉన్న రేగులపాలెం సమీపంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పవర్ ప్రాజెక్టు నిర్మాణంతో సాగు భూములు, పంట పొలాలు, జీడి మామిడి, చింత వంటి అటవీ తోటలతో పాటు గిరిజన మనుగడకే పెద్ద ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం వెనక్కు తీసుకోవాలని, లేని పక్షాన అల్లూరి స్ఫూర్తితో గిరిజన సాంప్రదాయ ఆయుధాలతో తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాజెక్టుల నిర్మాణానికి సర్వేలకు వచ్చిన బృందాలను తరిమికొట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే భవిష్యత్తులో మరింత పోరాటం ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జన్ని. ఈశ్వరరావు, రఘురాజు, పలు గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.










