ప్రజాశక్తి-చీరాల: ఉద్యోగ, కార్మిక, ప్రజా పోరాటాలకు అండగా నిలబడుతూ సమస్యలపై పోరాడే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డి గెలిపించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో చీరాల బ్రాంచ్ ఐఎల్టిడి ఫెడరేషన్ కార్మికుల సమావేశం ఫెడరేన్ అధ్యక్షుడు బి పోతురాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు, నిరుద్యోగులు, కూలీలు, రైతుల సమస్యలపై చట్టసభల్లో మాట్లాడే అభ్యర్థులను గెలిపించడం ద్వారా ఉద్యమాలు ముందుకు వెళతాయని అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పిడిఎఫ్) తరఫున గెలిచిన ఎమ్మెల్సీలు నిజాయితీగా అనేక ప్రజా సమస్యల్లో భాగస్వామ్యం అవటంతో పాటు, రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదా ఇవ్వాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించి, జాబ్ క్యాలండర్ ప్రకారం జాబ్‌లు ఇవ్వాలని, వ్యవసాయ కూలీ, రైతాంగ సమస్యలు, ప్రజలపై పడుతున్న ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు, ఇతర అధిక ధరలను తగ్గించాలని చట్టసభల్లో నిలదీస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యలను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ పథకాల్లో పనిచేస్తున్న స్కీము వర్కర్స్, పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు నిరంతరం ఉద్యోగ, కార్మికుల పోరాటాల్లో భాగస్వామ్యం అవుతున్నారన్నారు. ఈనెల 13న జరగబోయే తూర్పు రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణి లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్, జిల్లా నాయకులు ఎన్ బాబూరావు, ఐఎల్‌టిడి ఫెడరేషన్ చీరాల బ్రాంచ్ కార్యదర్శి జి.సుధీర్, అధ్యక్షుడు బి పోతురాజు, ఫెడ రేషన్ నాయకులు పి ఖాలేషా, సుధాకర్, శివరాజ్, సురేంద్ర, ఇమ్మానుయేలు, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
పంగులూరు: నిరంతరం ప్రజా సమస్యలపైనే పోరాడే పిడిఎఫ్ అభ్యర్థులను, శాసనమండలికి పంపిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన మీగడ వెంకటేశ్వరరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. మంగళవారం సాయంత్రం మండలంలోని తూర్పు కొప్పెరపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఓటర్లను కలిసి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్‌బాబు మాట్లాడుతూ, శాసనమండలిలో సమస్యలను ప్రస్తావించేది, పోరాడేది పిడిఎఫ్ సభ్యులేనని అన్నారు. గత 15 సంవత్సరాలుగా శాసనమండలిలో అనేక సమస్యలను ప్రస్తావించి పోరాటం చేశారని, పోరాట పటిమ కలిగిన వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. పెద్దల సభగా పేరొందిన శాసనమండలికి మేధావులను, విజ్ఞానవంతులను పంపాలని కోరారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గం నియోజవర్గంలో రోజురోజుకీ పిడిఎఫ్ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి పట్ల సానుకూలత పెరుగుతోందని, అందరూ ప్రోత్సహించి వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి రవికుమార్, వేమూరి షడ్రక్, పి ప్రేమ్ కుమార్, పి యెహౌషువ, మల్లె ప్రసాద్, వి నాగరాజు, వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
మేదరమెట్ల: రాష్ట్రంలో ఉన్న సమస్యలను గుర్తించి శాసనమండలిలో మాట్లాడాలి అంటే పిడిఎఫ్ అభ్యర్థులను తప్పనిసరిగా గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని రాచపూడి గ్రామంలో కరపత్రాలు పంచుతూ ఓటర్లను కలిశారు. ఈ నెల 13వ తేదీన శాసనమండలికి జరిగే ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థి అయిన మీగడ వెంకటేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు ఎం ఆంజనేయులు, హెల్త్ డిపార్ట్‌మెంట్ బాధ్యులు కేఏ రాజు, కెవిపిఎస్ బాధ్యులు కంచర్ల సురేష్ బాబు పాల్గొన్నారు.










