పోలవరం:పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని పోలవరం డిఎస్‌పి కె.లతాకుమారి అన్నారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని మత్స్యకారులతో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలోఆమె మాట్లాడుతూ ప్రాజెక్టు స్పిల్‌వే ప్రాంతంలో నీరు ఎక్కువగా ఉండి ప్రమాద భరితంగా ఉంటుందన్నారు. గతేడాది డిసెంబర్‌లో అక్కడ వేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారులు మృతిచెందారన్నారు. ఆ ప్రాంతంలో వేట నిషేధించారన్నారు. మత్స్యకారులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ప్రాజెక్ట్ స్పిల్ వే ప్రాంతానికి దిగువన ఉన్న టూరిజం బోట్ పాయింట్ పరిధిలో మాత్రమే వేటకు అనుమతి ఉందన్నారు. దీనిపై పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గోదావరి పరిధి తగ్గిందన్నారు. 75 పడవల్లో మత్స్యకారులు వేటకు వెళ్తున్నారని అయితే నీరు తగ్గడం చేపలు దొరక్కపోవడం వంటి కారణాలవల్ల ఉపాధిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఇతర ప్రాంతాల నుండి మత్స్యకారులు అధిక సంఖ్యలో వచ్చి పెద్దపెద్ద వలలతో చిన్నచిన్న చేపలను సైతం పట్టుకొని వాటిని కోళ్ల మేతకు ఎగుమతి చేస్తున్నారన్నారు. దీంతో స్థానికంగా ఉండే మత్స్యకారులు నష్టపోతున్నామని డిఎస్‌పికి వివరించారు. దీనిపై స్పందించిన ఆమె మత్స్యకారుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్పిల్ వే దిగువన ఒక కిలోమీటర్ పరిధిలో వేటకు అనుమతి వచ్చేలా చూస్తానన్నారు. అప్పటివరకు మత్స్యకారులు ఆ ప్రాంతానికి వేటకు వెళ్లొద్దని వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయబాబు, ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, ప్రాజెక్టు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ అధికారులు పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.










