ప్రజాశక్తి - పోలవరం
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు జగదీష్ గుప్త, ఉమాపతి, శ్రీనివాస్ బృందం పోలవరం ప్రాజెక్టును శనివారం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఢిల్లీ నుంచి వచ్చిన ఈ సీనియర్ న్యాయవాదులు ప్రాజెక్టులో తొలుత స్పిల్ వే, ఎగువ, దిగువ కాపర్ డ్యాములు, పవర్ హౌస్, గ్యాప్-1 ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీనియర్ న్యాయవాది ఉమాపతి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ తదితర అంశాలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలవరం ప్రాజెక్టు పరిశీలించామని చెప్పారు. పనుల ప్రగతి, డిజైన్ తదితర అంశాలపై అవగాహన కోసం వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఇంజినీరింగ్ చీఫ్ సి.నారాయణరెడ్డి, సి.సుధాకర్‌బాబు, ఎస్‌పి నరసింహమూర్తి, డివిజన్-2 పి.వెంకటరమణ, మల్లికార్జునరావు, శ్రీనివాసరావు, పాండురంగయ్య పాల్గొన్నారు.










