పోలవరం ప్రాజెక్టు, పునరావాసంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలు ఆపాలి
ప్రజాశక్తి-కూనవరం
పోలవరం ప్రాజెక్టు, పునరావాసంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలు ఆపాలని సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక వైపు కేంద్రం 41.5 కాంటూరు వరకే నిర్మాణం జరుగుతుందని అంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 45 కాంటూరు వరకు నిర్మాణం చేస్తామని అనడం ముంపు ప్రాంత ప్రజలను అయోమయానికి గురి చేయడమే అవుతుందన్నారు. గతేడాది జులైలో వచ్చిన వరదల వల్ల ముంపు మండలాల ప్రజలందరూ నష్ట పోయారని, ఇదే సమస్య మళ్ళీ ఈ ఏడాది జులైలో పునరావృతమౌతుందని పేర్కొన్నారు. అందుకే ముంపు బారిన పడ్డ ప్రతి గ్రామాన్ని 41 కాంటూరులో కలపి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొంతన లేని ప్రకటనలు చేయడం మాని, ముంపు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, నాయకులు తాళ్లూరి శ్రీనివాసరావు, వెంకన్నబాబు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.










