ప్రజాశక్తి - పోలవరం
పోలవరం ప్రాజెక్టు పరిధిలో చిరుతపులి సంచరిస్తుందని, ప్రాజెక్టు కార్మికులు, తరచూ అడవిలో సంచరించేవారు అప్రమత్తంగా ఉండాలని అటవీ క్షేత్రాధికారి దావీదు రాజు సూచించారు. బుధవారం తెల్లవారుజామున పోలవరం ప్రాజెక్టు వాహనానికి స్థానిక 902 హిల్ ప్రాంతంలో గోదావరిలోకి తాగునీటి కోసం దిగి వెళుతున్న చిరుతపులి కనిపించడంతో ప్రాజెక్టు కార్మికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు చిరుతపులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి పాదముద్రలు పరిశీలించారు. అనంతరం దావీదు రాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కార్మికులు బహిర్భూమికి బయటకు వెళ్లడం, సరదాగా అడవుల్లో సంచరించడం చేయరాదని, ప్రాజెక్టు కార్మికులు చికెన్ వ్యర్థాలు, ఇతర మాంసాహార పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో పడవేయరాదని, అడవుల్లో కట్టెలు కొట్టుకునే వారు కలప కోసం వెళ్లేవారు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సంచరించరాదని హెచ్చరించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పివి.మధుకర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డి.రాజేష్ చిరుతపులి సంచరించిన ప్రాంతాల్లో పాదముద్రల సేకరణలో పాల్గొన్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్మికుల లేబర్ క్యాంపులో చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.










