Jun 22,2021 06:53

నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏవైనా...ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై చూపడం లేదు. 'చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుంద'ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలిస్తామని... గతంలో ఎకరాకు రూ.1.15 నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీల ఊసే లేదు.
    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై పదిహేనేళ్లు కావస్తున్నా...నిర్వాసితుల పునరావాస కల్పన చూస్తే ఆశ్చర్యంగానూ, నిరాశాజనకంగానూ వుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే కేవలం 9 గ్రామాల్లోని 3300 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. ఇది కేవలం 3 శాతం మాత్రమే. దీన్నిబట్టి ప్రభుత్వాలకు ప్రాజెక్టు నిర్మాణంపై వున్న శ్రద్ధ పునరావాసంపై లేదనే వెల్లడౌతున్నది.
    పోలవరం ప్రాజెక్టు నిర్మాణమైతే పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరంతో పాటు కుకునూరు, వేలేరుపాడు మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంతో పాటు వి.ఆర్‌ పురం, చింతూరు, కూనవరం మండలాలు ముంపుకు గురికానున్నాయి. వీటిలో పోలవరం, దేవీపట్నం తప్ప మిగిలినవి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రాలో విలీనమైనవే. ఈ మండలాల్లో 275 గ్రామాలు, 1.07 లక్షల కుటుంబాలు, 1.36 లక్షల ఎకరాలు మునగనున్నాయి. ఇంతవరకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని 8 గ్రామాల వారికి పునరావాసం కల్పించారు. ఈ గ్రామాలు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంత గ్రామాలే. తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండలం అంగలూరు గ్రామానికి పునరావాసం కల్పించారు. కల్పించారనేకంటే జల విద్యుత్‌ ప్రాజెక్టు కోసం బలవంతంగా రాత్రికి రాత్రే తొలగించారు. కాపర్‌ డ్యాం నిర్మాణంలో మూడేళ్ళుగా 60 గ్రామాలు వరద ముంపుకు గురౌతున్నాయి. కొద్దిపాటి వర్షానికే ఈ పరిస్థితి దాపురించింది. దీంతో 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే 90 గ్రామాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం హడావుడి పడ్తోంది. ఈ గ్రామాలను ఖాళీ చేయిస్తేనేగాని ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాదు. లేదంటే స్పిల్‌వే తలుపులు బిగించాక బ్యాక్‌వాటర్‌ నిలిచిపోయి ఆ గ్రామాలు శాశ్వతంగా మునిగిపోతాయి. అందుకే ఈ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తొందరపడ్తోంది. 45 కాంటూరు పరిధి లోకి వచ్చే గ్రామాలకు చెందిన కుటుంబాలకు పునరావాసం కల్పించే సంగతి తర్వాత చూద్దామన్న వైఖరిలో ఉంది.
    అయితే మొదట్లో పునరావస కల్పన తీరు చూసిన నిర్వాసితులు చిగురుటాకులా వణికిపోతున్నారు. నాడు పునరావసం అరకొరగానే కల్పించారు. దళారులతో నమ్మబలికించి ప్రలోభాలతో తరలించారు. నాటి ప్రభుత్వాన్ని, అధికారుల్ని నమ్మి మోసపోయామని తెల్సుకున్నారు. నేటికీ చాలామంది యువతీయువకులకు 18 ఏళ్ళు నిండిన వారికిచ్చే ప్యాకేజీ అందలేదు. గిరిజనుల ప్రధాన ఆస్తి అయిన పోడు భూములకు పట్టాల్లేవనే సాకుతో ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. నిర్వాసిత కాలనీ భవనాల నిర్మాణం నాసిరకంగా వుండడంతో ఇళ్ళలో వర్షపు నీళ్ళు కారిపోతున్నాయి. మిగిలిన వసతుల సంగతెలా ఉన్నా శ్మశానవాటిక లేనందున...మృతులకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు చేసేందుకు వారు పడ్డ యాతన వర్ణనాతీతం. షెడ్యూల్‌ ప్రాంతంలోని గిరిజనులకు షెడ్యూల్‌ ప్రాంతంలోనే పునరావాసం కల్పించాలి. కానీ చట్టవిరుద్ధంగా షెడ్యూల్‌ ప్రాంతమైన దేవరగొంది గిరిజనుల్ని నాన్‌షెడ్యూల్‌ ప్రాంతమైన పోలవరం తాలూకా ఆఫీస్‌ వద్ద పునరావాసం కల్పించారు. అప్పటి జిల్లా కలెక్టర్‌ గిరిజనుల్ని నమ్మబలికి తరలించారు. షెడ్యూల్‌ ప్రాంతంగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. అది జరిగే పని కాదని కొంత కాలానికే వారికి అర్థమైంది. గిరిజనులకు భూమికి భూమిగా ఇచ్చిన భూములు పలు గ్రామాల్లో నేటికీ వివాదాల్లోనే ఉన్నాయి.
    వీటన్నింటికీ మించి పునరావాస ప్రాంతంలో ఉపాధి ప్రశ్నార్ధకమైంది. ఓ పక్క వ్యవసాయపు పనులు రాన్రానూ తగ్గిపోతున్నాయి. ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ వ్యవసాయేతర పనులూ లేవు. స్థానికులకూ ఇదే పరిస్థితి. నిర్వాసితులూ ఉపాధి దొరక్క అల్లాడుతున్నారు. దీంతో పాటు స్థానికులు తమకున్న కొద్దిపాటి ఉపాధికి నిర్వాసితులు కారణమని భావిస్తుండడంతో సుహృద్భావ వాతావరణం దెబ్బ తింటోంది. కేవలం 9 గ్రామాల ప్రజలకు పునరావాస కల్పన ఇలా ఉంటే రేపు తమ పరిస్థితి ఏమిటని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. వీటిపై తొలి దశ నిర్వాసితులు రోడ్డెక్కి దీక్షలు, ప్రాజెక్టు పనుల అడ్డగింతతో స్వల్పంగా పరిష్కారమయ్యాయి.
    ప్రస్తుతం పునరావాస కల్పన తీరు గతం కంటే మెరుగ్గా గానీ నిర్వాసితులకు విశ్వాసం కల్పించేలా గానీ లేదు. పోలవరం, వేలేరుపాడు మండల్లాలోని గిరిజన నిర్వాసితులకు...బుచ్చాయిగూడెం, జీలుగుమిల్లి మండల్లాల్లోను, కుకునూరు మండలం లోని గిరిజనులకు ఆ మండలంలోనే ముంపులో లేని (అని ప్రభుత్వం చెబుతోంది) గ్రామాల్లో పునరావాసం కల్పిస్తున్నారు. మూడు మండల్లాలోని గిరిజనేతరులకు జంగారెడ్డి గూడెం మండలం చల్లావారి గూడెంలో మెగా కాలనీ నిర్మించనున్నారు. భూమికి భూమిగా సేకరణ గతంలానే సాగుతోంది. మూడేళ్ళుగా ప్యాకేజీ రేపోమాపో వచ్చేస్తుందని, కాలనీలకు తరలించేస్తారంటూ హడావుడి సాగుతూనే ఉంది. కానీ కాలనీల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుంది. మొత్తం నిర్వాసితుల కాలనీల నిర్మాణం మాటెలా ఉన్నా 41.15 కాంటూరు పరిధి లోని నిర్వాసితుల కాలనీల నిర్మాణం కొలిక్కి రాలేదు. గిరిజనుల కాలనీల్లో కొన్ని ఇళ్ళ నిర్మాణం పూర్తైనా రోడ్లు, మంచి నీళ్ళు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల జాడ లేదు. గిరిజనేతరుల కాలనీల్లో ఇంకా పునాది దశలోనే వందల ఇళ్ళు దర్శనమిస్తున్నాయి. భూసేకరణ చట్టం-2013 ప్రకారం రోడ్డు, మంచి నీళ్ళు, విద్యుత్‌, గుడి, బడి, శ్మశానం, పశువుల దొడ్లు వంటి 39 సౌకర్యాలు కల్పించాల్సి వుంది. సమగ్ర నిర్మాణం సందేహమే. జీఓ నెం 641 ప్రకారం గిరిజనుల ఇళ్ళకు రూ.4.55 లక్షలు కేటాయించాలి. అయితే ప్రభుత్వం రూ.2.84 లక్షలతో సరిపెడుతున్నది. ఫలితంగా ఇళ్ళ నిర్మాణ నాణ్యత ప్రశ్నార్థకంగా ఉంది.
     పునరావాస ప్యాకేజీ 9 గ్రామాలకు మినహా ఏ ఒక్క నిర్వాసితునికి అందలేదు. చట్ట ప్రకారం రూ.9.50 లక్షలివ్వాలి. జగన్‌ ఎన్నికల హామీగా రూ.10 లక్షలిస్తామన్నారు. అయితే ఇటీవల నిర్వాసితులు ఖాళీ చేసేటప్పుడు రూ.6.50 లక్షలిస్తామని, మిగిలినది కాలనీలకు వెళ్ళాక ఇస్తామని ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్రత్యేకాధికారి పత్రికలకు తెల్పారు. గతంలోనూ నిర్వాసితులకు ఇలా ఇచ్చిన వాగ్ధానం అమలు కాలేదు. ఇప్పుడు అలాగే అవుతుందేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక లబ్ధిదారుల జాబితాపై గందరగోళం సాగుతోంది. 2016-17లో అర్హుల జాబితా తయారు చేశారు. ఇందులో తమ పేర్లు లేవని వందలాది దరఖాస్తులు వచ్చాయి. తన వాట్సాప్‌కు తెలపాలని నాటి పి.ఓ బహిరంగ ప్రకటన చేశారు. దీంతో రాజకీయ, వ్యక్తిగత విభేదాలతో అర్హుల పేర్లను అధికారులకు అందించారన్న విమర్శలున్నాయి. వీటికితోడు దళారుల జోక్యంతో కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వేల రూపాయల లంచాలతో నకిలీ రేషన్‌, ఆధార్‌ కార్డులు పుట్టించారు. వారు కూడా అర్హుల జాబితాలో చేరిపోయారు. జాబితాలో గందరగోళానికి తెరవేయాలని నిర్వాసితులు కోరుతూనే ఉన్నారు.
    కుకునూరు, వేలేరుపాడు మండల్లాల్లో ఎఫ్‌.ఆర్‌.ఎల్‌ (వరద నీటి మట్టం) గుర్తింపు కూడా అసంబద్ధంగా ఉందంటున్నారు. ఇవే ఆరోపణలు తూర్పు గోదావరి జిల్లా మండలాల్లోనూ ఉన్నాయి. 1986 వరదల్లోనూ, తర్వాత వచ్చిన అన్ని వరదల్లోనూ ఇళ్ళు, పొలాలు మునిగినా ఎఫ్‌.ఆర్‌.ఎల్‌ పరిధి లోకి రాకపోవడమేమిటో అర్థం కావడం లేదు. దీంతో ప్రతీసారీ వరదల్లో చిక్కుకునే వ్యవసాయపు భూములు, వందలాది ఎకరాలు పరిహారానికి నోచుకోవడంలేదు. కుకునూరు మండలం గొమ్ముగూడెంలో గోదావరికి చేర్చివున్న పొలాలను సైతం ముంపు ప్రాంతంగా గుర్తించలేదు. కొన్ని గ్రామాలను ముంపుగా గుర్తించారు. కానీ ఆ గ్రామాల్లోని పొలాలను గుర్తించలేదు. మరికొన్ని చోట్ల పొలాలు గుర్తిస్తే గ్రామాన్ని ముంపుగా గుర్తించలేదు. ఈ సమస్య పోలవరం మండలం తప్ప అన్ని మండలాల్లో ఉంది. అందుకే మండలాన్ని యూనిట్‌గా గుర్తిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
    పద్దెనిమిదేళ్ళు నిండిన వారికి ప్యాకేజీ ఇచ్చేందుకు 2017ను నిర్ణీత కాలంగా గుర్తించారు. కానీ 2017 నాటికి పునరావాసం కల్పించలేదు. 2021లో ఖాళీ చేయాలని సన్నాహాలు చేస్తున్నందున ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాల యువతీ, యువకులందరికీ వర్తింప చేయాలంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వున్న ఈ సమస్యలన్నీ....రెట్టింపు గ్రామాలు, నిర్వాసిత కుటుంబాలున్న తూర్పు గోదావరి జిల్లాలో రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.
    నిర్వాసితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఏవైనా ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై చూపడం లేదు. 'చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితుల్ని పట్టించుకోవడం లేదు. ఇది మన ప్రభుత్వం కాదు. త్వరలోనే మన ప్రభుత్వం రానుంద'ని జగన్‌ ఎన్నికల ముందు మాట్లాడారు. తానొస్తే పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలిస్తామని...గతంలో ఎకరాకు రూ.1.15 నుండి రూ.1.25 లక్షలు పొందిన భూములకు కుటుంబానికి రూ.5 లక్షలిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీల ఊసే లేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడ్డాక కేంద్ర ప్రభుత్వంపైనే ప్రధాన బాధ్యత ఉంటుంది. కానీ నేటికీ ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం గందరగోళం కొనసాగిస్తోంది. పైగా, పునరావాసం బాధ్యత తనది కాదని నిండు పార్లమెంట్‌లో మంత్రి తోమర్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో 70 శాతం నిధులకు తనకు సంబంధం లేదనడం ఓ ఎత్తైతే ...ప్రాజెక్టు పునాదులైన నిర్వాసితుల్ని విస్మరించడం మరో ఎత్తు. నిర్వాసితుల్లో అత్యధికులైన గిరిజనుల పట్ల వ్యవహరించే తీరుకు ఇది అద్దం పడుతుంది. తమ త్యాగాలను విస్మరించి తమ పునరావాసం పట్ల పాలకులు వహిస్తున్న నిర్లక్ష్యంపై నిర్వాసితుల ఆగ్రహం న్యాయమైనది. పునరావాసం భిక్ష కాదు. వారి న్యాయమైన హక్కు. సమగ్ర ప్యాకేజీకి పోరాటమే మార్గం. వీరికి అండగా నిలవడం రాష్ట్ర ప్రజల బాధ్యత.
 

/ వ్యాసకర్త ఆం.ప్ర. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, సెల్‌:9490098535 /
ఎ.రవి

ఎ.రవి