Jun 22,2023 22:33

ప్రజాశక్తి - కుక్కునూరు
          నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన పోలవరం పోరుకేక యాత్రను విజయవంతం చేయాలని గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలు, సంజరునగర్‌, రామసింగారం సెంటర్లలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు, నాయకులు వై.సాయికిరణ్‌, పి.లక్ష్మయ్య, కె.మోహన్‌రావు పాల్గొన్నారు.
వేలేరుపాడు: పోలవరం పోరుకేక పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం సిపిఎం ఆధ్వర్యంలో వేలేరుపాడు, శివకాశీపురం, రుద్రమ్మకోట గ్రామాల్లో ఇంటింటికీ కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ధర్ముల రమేష్‌, మడివి దుర్గారావు, కె.వెంకట్రావు, గుమ్మల నర్సయ్య, లక్ష్మీ పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం: పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన సిపిఎం మహాపాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్‌ అన్నారు. గురువారం స్థానికంగా వామపక్షాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సిపిఎం పట్టణ కన్వీనర్‌ పసల సూర్యారావు అధ్యక్షత వహించగా జీవరత్నం, తలారి ప్రకాష్‌ మాట్లాడుతూ మన రాష్ట్రానికి జీవనాడిగా పిలుస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యపూరిత వైఖరిని ఖండించారు. తక్షణమే నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. చట్టప్రకారం నిర్వాసితులకు ప్యాకేజీ కల్పించాలని, గ్రామాలు ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన యువతీ యువకులందరికీ ప్యాకేజీ ఇవ్వాలని అన్నారు. 1986, 2022 నాటికి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాల్లో సర్వే చేయాలని కోరారు. ప్రతి ఎకరా భూమికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని, పునరావాసం పూర్తయ్యే వరకు ముంపు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 30న జరగనున్న బహిరంగ సభ, యాత్ర జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సముద్రాల సుందర్రావు, కలవపూడి సుందర్రావు, బోడ ఏసుపాదం, ఎస్‌కె.సుభాషిణి, జి.సూర్యకిరణ్‌, పట్టణ పౌర సమాఖ్య నేత వంగ గోపి, యాగంటి సీత, రాంబాబు, అందుగుల ప్రభాకర్‌రావు, ఎస్‌కె.మాబు పాల్గొన్నారు.