ప్రజాశక్తి-విఆర్.పురం
పోలవరం పోరుకేక పాదయాత్రలో పాల్గొన్న వాలంటీర్ల అభినందన సభ గురువారం మండల కేంద్రం రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో జరిగింది. పోలవరం పోరుకేక పేర ఎటపాక మండలం నెల్లిపాక నుండి విజయవాడ వరకు 15 రోజుల పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించిన విషయం విధితమే. ఈ పాదయాత్రలో విఆర్.పురం మండలం నుండి పాల్గొన్న వాలంటీర్లకు అభినందన సభ ఏర్పాటు చేయగా, వారంతా తమ అభిప్రాయాలను వెల్లడించారు. సభకు అధ్యక్షత వహించిన సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాల్లాడుతూ పోరుకేక పాదయాత్ర సందర్భంగా ప్రజలు అనేక సమస్యలను సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ గ్రామ గ్రామాన నిర్వాసితులు పాదయాత్ర బృందానికి ఎదురెళ్లి నీరాజనాలు పలికారని పేర్కొన్నారు. అనంతరం మండలం నుండి పాల్గొన్న 94 మంది వాలంటీర్లకు మెమోంటోలను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో రేఖపల్లి వార్డు మెంబర్ కట్టం లక్ష్మి, వెట్టి శ్రీను, తోడం అమరావతి, కూర జోగయ్య, పోడియం గంగరాజు, కొవ్వాసి లక్ష్మణ్, మడకం రాధ, వాలంటీర్లు బృందం పాల్గొన్నారు.










