- సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు
ప్రజాశక్తి- విఆర్.పురం
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 20 నుంచి చేపట్టనున్న పోలవరం పోరుకేక పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు పిలుపునిచ్చారు. మండలంలోని నాగేంద్రపురంలో రవ్వ సోమరాజు అధ్యక్షతన మంగళవారం పాదయాత్ర సన్నాహాక సమావేశం జరిగింది. పాదయాత్రలో తాము భాగస్వాములవుతామని గ్రామస్తులు తెలిపారు. అలాగే పాదయాత్రి నిర్వహణకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల పునరావాసం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం, ప్యాకేజీ కల్పించిన తరువాత పోలవరం నిర్మాణం చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. దీని వల్ల వరదల సమయంలో నిర్వాసిత గ్రామాలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసితుల సమస్యలను ఎజెండా చేసే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఇందులో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పంకు సత్తిబాబు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










