Nov 13,2022 23:23

మాట్లాడుతున్న గిరిజన సంఘం నాయకులు

ప్రజాశక్తి-కూనవరం
పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న నిర్వాసిత గిరిజనులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని గిరిజన సంఘం నాయకులు పాయం సీతా రామయ్య, మండల కార్యదర్శి బాబు బొర్రయ్య డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో తెల్లం తమ్మయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన గిరిజన సంఘం మండల కమిటీ సమవేశంలో వారు మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు, గిరిజనేతరులకు పోలవరం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ వల్ల వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ ఏడాది వచ్చిన మూడు గోదావరి వరదల వల్ల గిరిజనులు పంటలు సకాలంలో వేయలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అతివృష్టి, అనావృష్టి వల్ల పంటలు పండే పరిస్థితి లేదన్నారు. కూనవరం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి తగిన సహాయం రైతులకు అందించాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మడకం పొద్దయ్య, జ్యోతి, సొందే లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.