Jul 03,2023 01:06

నేతాజికి నిధి అందజేస్తున్న మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి-గుంటూరు : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పోరాటానికి సంఘీభావంగా సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ సంఘీభావం నిధి అందచేసింది. ఆదివారం నగరంలో నిర్వహించిన యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశంలో మెడికల్‌ రిప్రజెంటివ్‌లు ఈ మొత్తాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజికి యూనియన్‌ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా నేతాజీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని, గతేడాది వచ్చిన గోదావరి వరదల వల్ల 190పైగా గ్రామాల ప్రజలు తమ ఇల్లు వదిలి నెలల తరబడి కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని బ్రతకాల్సి వచ్చిందని అన్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు కనీసమైన సహకారం కూడా అందించలేదని విమర్శించారు. పోలవరం నిర్మాణం పూర్తయితే నిర్వాసితులంతా శాశ్వతంగా తమ నివాసాలు, భూములు కోల్పోవాల్సి వస్తుందని, కావున అలాంటి వారి పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై జూన్‌ 20 నుండి జూలై 4 వరకు మహాపాదయాత్ర జరుగుతోందని, ఈ పోరాటానికి కార్మికవర్గం తరపున సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మెడికల్‌ రిప్రెజెంటేటివ్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఫణి, సలీం, ఆనంద్‌, శ్రీనివాస్‌, హనుమంతరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్‌లో మంగళవారం జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ధర్నా పోస్టర్‌ను స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ప్రారంభమై 18 ఏళ్లయినా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్రాలు విఫలమయ్యాయిని విమర్శించారు. ముంపు వల్ల 70 గ్రామాలు మునిగిపోతాయని, ఆ గ్రామాల రిసర్వే చేసి పునరావసం ఏక కాలంలో చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఆర్‌ పరిహారం అర్హులందరికీ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, నాయకులు పి.బాలకృష్ణ, ఎం.బాలాజీ పాల్గొన్నారు.