ప్రజాశక్తి-విఆర్.పురం
పోలవరం నిర్వాసితుల న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యాన సోమవారం మండల కేంద్రం రేఖపల్లి నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మండ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సర్వేల పేరుతో కాలం వెళ్లదీస్తున్న పాలక ప్రభుత్వాలు కళ్ళు తెరిపించాలని ఈ నెల 26న పోలవరంలో జరిగే బహిరంగ సభకు నిర్వాసితులు తరలి రావాలని పిలుపునిచ్చారు. గతంలో లక్షా 15వేల రూపాయలు ఇచ్చిన భూములకు ముఖ్యమంత్రి హామీ మేరకు రూ.5 లక్షలు ఇవ్వాలని, గిరిజనులతో సమానంగా గిరిజననేతరులకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలని, మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కర్నాటి రాంబాబు, ఏసు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిపిఐ ర్యాలీకి సిపిఎం మద్దతు
చింతూరు : పోలవరం నిర్వాసితుల సమస్యలపై సిపిఐ నిర్వహించిన బైక్ ర్యాలీకి చింతూరులో సిపిఎం నాయకత్వం స్వాగతం పలికి సంఘీభావం తెలియజేసింది. 20వ తేదీ నుండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో జరుగు నిర్వాసితుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలియజేయాలని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణ మూర్తి, జిల్లా నాయకులు దుర్గాప్రసాద్, బుజ్జా మోహన్‌రావు పాల్గొన్నారు. సంఘీభావం తెలియజేసిన వారిలో సిపిఎం నాయకులు కుంజ సీతారామయ్య, యర్రంశెట్టి శ్రీనివాసరావు, పల్లపు వెంకట్, సీసం సురేష్, పోడియం లక్ష్మణ్, ఎండి సలీం ఉన్నారు.










