ప్రజాశక్తి-కూనవరం
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 20 నుండి నిర్వహించనున్న మహాపాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య పిలుపునిచ్చారు. పాదయాత్రపై ప్రచారంలో భాగంగా మంగళవారం మండలంలోని కూటూరు గ్రామంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో వారు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, ముంపునకు గురవుతున్న భూమలకు నష్టపరిహారం తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ వల్ల నిర్వాసితులైన ప్రతి గిరిజనులకు భూమికి భూమి ఇవ్వాలన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన ప్రతి భూమికి సాగునీటి వసతి ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 20 నుండి జులై 9 వరకు నెల్లిపాక నుండి విజయవాడ వరకు 18 రోజులు 400 కిలోమీటర్లు, 1000 మందితో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముంపు గ్రామాలను కలుపుతూ సాగే ఈ పాదయాత్రకు నిర్వాసితులు అధిక సంఖ్యలో కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి పాయం శేఖర్, నాయకులు పద్దం రాజు, శ్రీరాములు, నూపా రాజు, చిచ్చడి రాజయ్య, గిరిజనులు పాల్గొన్నారు.










