Jun 03,2023 00:13

సన్నాహాక సమావేశంలో మాట్లాడుతున్న నాగేశ్వరరావు

ప్రజాశక్తి-ఎటపాక
పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి చేపడుతున్న మహా పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని నందిగామలో శుక్రవారం మహా పాదయాత్ర సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం నిర్మాణం ప్రారంభించి 18 సంవత్సరాలు గడుస్తున్నా నిర్వాసితులకు ఇప్పటికీ ఏ ఒక్కరికీ సంపూర్ణ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరుగుతుందన్న గ్యారెంటీ కూడా ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయని విమర్శించారు. 2022 జులైలో వరద బీభత్సం నుండి ప్రజలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారని, ప్రభుత్వం శాశ్వత పరిష్కార మార్గం చూపెట్టలేకపోతుందని పేర్కొన్నారు. అప్పటి వరదలలో ముంపునకు గురైన గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని పోలవరం ముంపు జాబితాలో చేర్చి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లకు నిర్మాణ చేపడుతూ, పునరావాసం 41.15 మీటర్ల ముంపు వరకే చెల్లిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించడం దారుణమన్నారు. పోలవరం నిర్వాసితులందరూ ఒకే తాటిపైకి వచ్చి ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఐవి, నాయకులు సొందే రామారావు, కారం జయమ్మ, పులుసు సూర్యనారాయణ, సోయం పెదబాబు పాల్గొన్నారు.
పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి
కూనవరం : మండలంలోని ఆర్కూర్‌లో జరిగిన మహాపాత్ర యాత్ర సన్నాహాక సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతరామయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది కల్ల పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని అంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న భూములకు, ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు ధరలు పెంచిందని, అందుకు అనుగుణంగా ముంపు భూములకు ఎకరాకు రూ.30లక్షల నుండి రూ.50 లక్షలకు పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాజెక్టు దిగువున వున్న భూములకు ధరలు పెంచి, అదే ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతున్న భూములకు పెంచకపోవడం అన్యాయమన్నారు. దీనిపై పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, పాయం సత్యనారాయణ, తాళ్లూరి శ్రీనివాసరావు, కర్నాటి శ్రీనివాసరావు, ఆవుల మురళి, ఆవుల ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మహా పాదయాత్రపై జోరుగా ప్రచారం
విఆర్‌.పురం : పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 20న మండలంలోని రేఖపల్లిలో ప్రారంభం కానున్న మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ మండలంలోని జీడిగుప్ప, ములకపల్లి, కోటారి గొమ్ము గ్రామాల్లో సిపిఎం నాయకులు శుక్రవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల, గోదావరి వరదల వల్ల మునిగిపోతున్న ప్రతి గ్రామానికి మొదటి ప్రాధాన్యతగా తీసుకొని అందరికీ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ, పునరావాసం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వడ్లడి రమేష్‌, కుంజా నాగిరెడ్డి, కథల కొండారెడ్డి, కథల రామిరెడ్డి, వల్లా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.