ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వాసితులు చింతూరు ఐటిడిఎ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, పల్లపు వెంకట్, మండల కార్యదర్శి సీసం సురేష్ మాట్లాడుతూ చింతూరులో ఆపేసిన పోలవరం సర్వేను తక్షణమే ప్రారంభించాలన్నారు. గిరిజనేతరులకు కూడా ప్రభుత్వమే భూమి ఇచ్చి, ఇల్లు కట్టి ఇవ్వాలని, మొదటి ప్రాధాన్యతగా ఇల్లు నిర్మించాలని, తాడ్వాయిలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఇల్లు నిర్మాణాలు చేయాలని డిమాండ్ చేశారు. 2022లో వచ్చిన వరదల్లో పోలవరం బ్యాక్ పార్టు కారణంగా చింతూరు మొత్తం మునిగిపోయిందని, దానికోసం 41.15 కాంటూరులో చింతూరు గ్రామాన్ని క్లారిటీగా చేర్చాలని తెలిపారు. ఆ విధంగా ఇటీవల కుటుంబాలు సర్వే నిర్వహించాలని గ్రామసభలు కూడా పెట్టడం జరిగిందని తెలిపారు. కాని సర్వేను ఆపివేసి మరోపక్క మొదటి ఆప్షన్ అనగా ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇంటిని అధికారులు మీటింగ్ల్లో వెల్లడి చేసి వాలంటీర్లకు చెప్పడం జరిగిందన్నారు. కుక్కునూరు, వేలేరుపాడు, విఆర్ పురం మండలాల్లోని గిరిజనేతరులకు తాడువాయిలో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లను కేటాయించడం జరిగిందని చెప్పారు. ఇక్కడ కూడా మొదట మూడవ ఆప్షన్ ఇవ్వటం జరిగిందని, మళ్లీ ఎటువంటి జీవో లేని ఈ ప్రతిపాదనను ప్రచారాన్ని అధికారులు ముందుకు తేవటం దుర్మార్గమన్నారు. నిర్వాసితుల మధ్య చిలిక తేవద్దని, వారిని గందరగోళంలోకి అధికారులు నెట్టవద్దని హితవుపలికారు.
అనంతరం ఐటీడీఏ ఇన్‌ఛార్జి పీవో సూరజ్ గనూరే ఆందోళన వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. నాయకులు మాట్లాడుతూ గిరిజనేతరులకు కేవలం చింతూరు మండలానికి ప్రయారిటీ పేరుతో ఒకటో ఆప్షన్ తొలగించి రెండు మూడు ఆప్షన్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. నిర్వాసితులంతా ముంపు బాధితులైనని ఇక్కడ కులమత భేదాలు తావులేదని మునిగే వారందరూ ఒకే కోవలోకి వస్తారని వారందరికీ ఒకే న్యాయం జరగాలని కోరారు. 2022లో వచ్చిన వరదలకు వందల కుటుంబాలు సర్వస్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని, ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు. ఈ విషయంపై పిఓ సమాధానమిస్తూ 17 గ్రామాలను ముంపు జాబితాలో చేర్చడం జరిగిందని ఇది ప్రయారిటీ పేరుతో ప్రభుత్వం నిర్వాసితులకు అవకాశం కల్పించిందని చెప్పారు. నిర్వాసితుల అభ్యర్థన మేరకు ఈ విషయంపై ప్రభుత్వానికి తమ డిమాండ్లను పంపడం జరుగుతుందన్నారు. గిరిజనులకు మాదిరిగానే గిరిజనేతర పేదలకు కూడా ప్రభుత్వం ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్ను కొనసాగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం నిర్వాసితులు దరఖాస్తులను పిఓపి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు లక్ష్మణ్, ఎస్సీ. బీసీ కాలనీ, సంతపాకల నిర్వాసితుల ప్రజలు పాల్గొన్నారు.










