ప్రజాశక్తి-విఆర్.పురం
పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని జడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి ముత్యాల రామారావు డిమాండ్ చేశారు. మండలంలోని రాజుపేట గ్రామంలో టిడిపి మండల సర్వసభ్య సమావేశం గురువారం టిడిపి మండల అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్, వైస్ ఎంపీపీ భాగ్యలక్ష్మి, కార్యదర్శి బురక కన్నారావు ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి, రామారావు మాట్లాడుతూ ఈ ఏడాది నాలుగు సార్లు వచ్చిన వరదలకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఆస్తి నష్టపోవడం జరిగిందని తెలిపారు. నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలని కోరారు. సెటిల్మెంట్ భూమి, అసైన్మెంట్ భూమితో పాటు పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నిర్వాసిత గ్రామాలలో గిరిజనులు 20 ఏళ్ల క్రితం నుండి సాగు చేస్తున్న భూములను గుర్తించి సర్వే చేసి వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి పోలవరం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి కూడా భూ నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఈ మధ్య ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ నోటిఫికేషన్‌లో రామవరం పంచాయతీ రామవరం గ్రామంలో 104 కుటుంబాలు ఇళ్లు పోలవరం ముంపు జాబితాలో లేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాంబాబు, ముత్యాల సిద్దు, రహీం, భాగ్యలక్ష్మి, బీరక. సూర్య ప్రకాష్ రావు, ముత్యాల చంద్రశేఖర్, సౌలం రాజు, పెందుర్తి బాలాజీ, గొర్రె వెంకటేశ్వర్లు, రేవు సింహాచలం, పెట్టా రఘుపతి తదితరులు పాల్గొన్నారు.










