Jun 08,2023 00:04

మాట్లాడుతున్న వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య

ప్రజాశక్తి- కూనవరం
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసమే ఈ నెల 20 నుండి మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య తెలిపారు. మండలంలోని పల్లూరు గ్రామంలో పాదయాత్రపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ వల్ల నష్టపోతున్న నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అలసత్వం చూపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది వచ్చిన వరదల వల్ల ముంపు మండలాల ప్రజలు ఆర్థికంగా నష్ట పోయారని తెలిపారు. వరదల సమయంలో విద్యుత్‌ సరఫరా లేక కటిక చీకటిలో వారాల తరబడి ఇబ్బంది పడ్డారని వాపోయారు. వరదల సమయంలో కనీసం నిత్యావసరాలు కూడా అందించలేదన్నారు. ఆ సమయంలో వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. ముంపు మండలాల నుండి విజయవాడ వరకు జరుగుతున్న పాదయాత్రకు ప్రతి నిర్వాసితుడు తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ కింద మునుగుతున్న గ్రామాలన్నింటినీ ఒక యూనిట్‌గా చేసి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇప్పించాలని, వచ్చే వరదలకు ప్రభుత్వం నిత్యావసరాలు అందించాలని, బఫర్‌ స్టాక్‌ పాయింట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీపీఎం నాయకులు మేకల నాగేశ్వరరావు, మండల నాయకులు ఆవుల మురళి, ఆవుల ఉపేంద్ర, కర్నాటి శ్రీనివాసరావు, జోడే రాజు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.