పోలవరం కాంటూరు లెక్కలు శాస్త్రీయంగా లేవు : డిఆర్‌సి సమావేశంలో ఎంఎల్‌సి షేక్ సాబ్జీ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 36 మీటర్ల నీటిమట్టానికే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 90 శాతానికిపైగా గ్రామాలు మునిగిపోయాయని, దీన్నిబట్టి కాంటూరు లెక్కలు శాస్త్రీయంగా లేవని స్పష్టమవుతుందని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ అన్నారు. గురువారం ఏలూరు డిఆర్‌సి (జిల్లా సమీక్షా కమిటీ సమావేశం) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్‌సి సాబ్జీ మాట్లాడుతూ ముంపునకు గురైన గ్రామాలన్నింటినీ 41.15 కాంటూరుకు పరిధిలో చేర్చి ఆర్‌అండ్‌ఆర్ పరిహారం అందించాలన్నారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్షా 80 వేలు ఏమాత్రం సరిపోవడం లేదని, రూ.ఐదు లక్షలు ఇస్తే బాగుంటుందని తెలిపారు. దెందులూరు మండలం దోసపాడులో అన్యాక్రాంతమైన దళితుల సీలింగ్, అసైన్డ్ భూములను నిరుపేద కుటుంబాలకు చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలీలకు బకాయిలను చెల్లించాలని, తక్షణమే పనులు కల్పించాలని, వేతనాలకు సంబంధించిన పేస్లిప్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేయడంతోపాటు, భూములు కోల్పోయిన రైతులకు, గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలన్నారు. 33 శాతం దెబ్బతింటేనే పంట నష్టం నమోదు చేస్తున్నారని అలాకాకుండా ఎంతమేర దెబ్బతింటే అంతవరకూ నమోదు చేసేలా నిబంధనలను మార్పుచేయాలన్నారు. ఖరీఫ్‌లో మాదిరిగా కాకుండా రబీలో పండిన పంటను నూరుశాతం కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీకళాశాలకు స్థలం కేటాయించి, ఎంపీ నిధులు మంజూరు చేసి శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. ఏలూరు కార్పొరేషన్‌లో ఉన్న ఉర్దూ ఉన్నతపాఠశాలలో ఉర్దూ పండిట్ పోస్టును మంజూరు చేయాలన్నారు. జిల్లాలో అన్యాక్రాంతమైన వక్ఫ్‌బోర్డు భూములను కేంద్రచట్టాలను అనుసరించి స్వాధీనం చేసుకునే చర్యలను చేపట్టాలన్నారు. బుట్టాయగూడెం మండలంలో ఎస్‌సి మహిళను వివాహం చేసుకుంటానని గర్భవతిని చేసి మోసగించిన నిందితుడిపై వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. పూర్వపశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని వివేకానంద ఎయిడెడ్ పాఠశాలలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయురాలు కె.సుగుణకుమారిని ఉద్యోగ విరమణ వయస్సును ప్రభుత్వం పెంచినందున తిరిగి విధుల్లోకి చేర్చుకునే విధంగా ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఏలూరు కార్పొరేషన్‌లో పాఠశాలల్లో వెనక్కి తీసుకున్న నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను తిరిగి పాఠశాలల్లో నియమించాలన్నారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యూయేట్ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా తాగేందుకు వీలుగా తాగునీరు లేదని, గోదావరి నుంచి పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందిస్తామని చెప్పిన వాటర్‌గ్రిడ్ పథకం ఏమైందని ప్రశ్నించారు. మండలానికి ఒక జూనియర్ కాలేజీ అంటూ హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన ఇంటర్ విద్య పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని, దీనిపై స్పష్టత ఇవ్వాలలని కోరారు.










