Sep 13,2023 21:49

ప్రజాశక్తి - పోలవరం
            పోలవరం జల విద్యుత్‌ కేంద్రం పనులను మరింత వేగవంతం చేయాలని ఎపి జెన్‌కో మేనేజింగ్‌ డైరెక్టర్‌ కెవిఎన్‌.చక్రధరబాబు సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం జెన్‌కో, జలవనరుల శాఖ, మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ అధికారులతో ఆయన సమీక్షించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్దేశిత గడువులోగా పోలవరం జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఉదయం పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్న చక్రధరబాబు పోలవరం స్పిల్‌ వే, ఎగువ, దిగువ కాపర్‌ డ్యాములను పరిశీలించారు. ఆ తరువాత ఫెర్రెల్స్‌ తయారు చేసే ప్రాంతం పరిశీలించారు. అనంతరం పోలవరం జల విద్యుత్‌ కేంద్రం ఎగువ ప్రాంతం నుంచి నిర్మాణాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి జల విద్యుత్‌ కేంద్రం టన్నెల్స్‌ నుంచి ప్రయాణించి దిగువ ప్రాంతానికి చేరుకుని కోన్‌, డ్రాఫ్ట్‌ ట్యూబుల ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి నుంచి క్రేన్‌ బాస్కెట్‌లో పోలవరం జల విద్యుత్‌ కేంద్రం శిఖరాగ్రానికి వెళ్లి పనులను విహంగ వీక్షణం చేశారు. టైల్‌ రైజ్‌ ఛానల్‌ను కూడా ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి పోలవరం జల విద్యుత్‌ కేంద్రంలో జెన్‌కో కోసం నిర్మిస్తున్న కార్యాలయం వద్దకు వెళ్లి మొక్కలు నాటారు. అనంతరం జెన్‌ కో, ఎంఇఐఎల్‌ సంస్థ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్‌ పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశిత లక్ష్యం మేరకు జరుగుతున్నాయని, ఇక నుంచి కూడా అలానే ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేసి త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి జెన్‌ కో, ముఖ్యంగా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పూర్తయ్యి ఉత్పాదన ప్రారంభమైతే రాష్ట్రంలో విద్యుత్‌ కొరత తీరుతుందని, పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి అవసరమైన మేర విద్యుత్‌ సరఫరా చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జెన్‌ కో హైడెల్‌ డైరెక్టర్‌ ఎంవివి సత్యనారాయణ, హైడల్‌ ప్రాజెక్ట్స్‌ సిఇ ఎం.సూరజ్‌కుమార్‌, సివిల్‌ విభాగం సిఇ వై.కోటేశ్వరరావు, సిఇ డిజైన్స్‌ ఎం.రవీంద్ర రెడ్డి, హెచ్‌పిసిఎస్‌ఇ కె.చంద్రశేఖర్‌, ఎస్‌ఇ సివిల్‌ డి.బాబూరావు, పోలవరం ప్రాజెక్ట్‌ ఎస్‌ఇ కె.నరసింహమూర్తి, ఎంఇఐఎల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ రంగరాజన్‌, జనరల్‌ మేనేజర్‌ శంకర్‌, డిజి ం క్రాంతి, ఎజిఎం దిలీప్‌ పాల్గొన్నారు.