Apr 01,2023 00:21

మాట్లాడుతున్న సిపిఐ నేత జెవి.సత్యనారాయణమూర్తి, చిత్రంలో సిపిఎం నేత లోకనాథం

ప్రజాశక్తి-అనకాపల్లి
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు సహించరని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి హెచ్చరించారు. స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో శుక్రవారం మాజీ శాసనసభ్యులు కామ్రేడ్‌ కోడిగంటి గోవిందరావు శతజయంతి సభ పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం తన ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా గోవిందరావు త్యజించిన విషయాన్ని గుర్తు చేశారు. తన 70 ఏళ్ల వయసులో కూడా భూ పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. కామ్రేడ్‌ గోవిందరావు శతజయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందని చెప్పారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే కామ్రేడ్‌ గోవిందరావు గురించి తెలుసని తెలిపారు. నాలుగు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక ప్రజా సమస్యలపై ఉద్యమించి పరిష్కరించారని తెలిపారు. తను నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు కమ్యూనిస్టుగానే పని చేశారని కొనియాడారు. గోవిందరావు కుమారులు డాక్టర్‌ శరత్‌ చంద్ర, రవి మాట్లాడుతూ తమ తండ్రి నమ్మిన సిద్ధాంతం కోసం నిబద్ధతతో పని చేశారన్నారు. తమ కుటుంబం కంటే పార్టీకే అంకితమై పనిచేశారని తెలిపారు. ప్రజలపై ప్రేమ లేనివాడు కమ్యూనిస్టు కాజాలడన్నారు. సిపిఎం సిపిఐ ఏకమై ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. ముందుగా స్థానిక నెహ్రూ చౌక్‌ జంక్షన్‌లో ఉన్న గోవిందరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏ.బాలకృష్ణ, గంట శ్రీరామ్‌, జి.కోటేశ్వరరావు, సిపిఐ నాయకులు రావు జగ్గారావు, రాజాన దొరబాబు, రామునాయుడు, విమల, వైఎన్‌ భద్రం, మల్ల మాధవరావు, గురుబాబు, అప్పలరాజు, డిసిహెచ్‌ క్రాంతి, కొండలరావు, అర్జున్‌, కోన లక్ష్మణ, వియ్యపు రాజు తదితరులు పాల్గొన్నారు.