ప్రజాశక్తి - పోలవరం
పోలవరం ప్రాజెక్టు భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎపి ఎస్‌పిఎఫ్ కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహారావు అన్నారు. బుధవారం ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన ఆయనకు ఎపి ఎస్‌పిఎఫ్ ప్రాజెక్ట్ సిఐ విజరుకుమార్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వ్వ్యూ, గైడ్ బండ్, ఎగువ, దిగువ కాపర్ డ్యాములు, పవర్ హౌస్ ప్రాంతాలను, ఆయా ప్రాంతాల్లో పోలీస్ బలగాల భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఎపి ఎస్‌పిఎఫ్ పోలీసులతో పోలవరం ప్రాజెక్టు భద్రత చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విజయవాడ నుండి రాజమహేంద్రవరం బదిలీపై వచ్చినట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి పోలవరం ప్రాజెక్టు సందర్శించానన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణాజిల్లా పోలవరం వరకూ తన పరిధి విస్తరించి ఉందన్నారు. ఆ ప్రాంతాల పరిధిలో ఎంఎల్‌ఎల ప్రత్యేక భద్రత కోసం రాజమండ్రి ఒఎన్‌జిసి రిలయన్స్ విజయవాడ దుర్గమ్మ ఆలయం, విశాఖపట్నం రెయిన్ బో ప్రాంతాలలో పని చేస్తున్న ఎపి ప్రత్యేక భద్రత పోలీస్ విభాగాలు తన పరిధిలోనే ఉన్నాయన్నారు. ప్రాజెక్టు గుత్తేదారులతో, జలవనరులశాఖ అధికారులతో మాట్లాడారు. ప్రాజెక్టులో 44 మంది తమ భద్రతా సిబ్బంది 24 రకాల విధులు నిర్వహిస్తున్నారని, వారితో సమీక్షించి వారి బాధ్యతలు, వారు తీసుకోవాల్సిన చర్యల గురించి తగు సూచనలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో భద్రతా బలగాల విధులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్ విజయకుమార్, ఎస్‌ఐ ఎస్.మల్లేశ్వరరావు, ఎఎస్‌ఐలు కె.శ్రీనివాసరావు, సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్స్ కె.శ్రీనివాసరావు, పురుషోత్తం, పంతాడ రాజశేఖర్, కానిస్టేబుల్స్ లోవ రాజు, సురేష్, సిహెచ్.చిన్నిబాబు ఉన్నారు.










