ప్రజాశక్తి - పోలవరం
డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పిదం పోలవరం ప్రాజెక్ట్‌కు అవరోధంగా మారిందని రాష్ట్ర వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి పోలవరం పనులు ఎలా ఉన్నాయి.. తమ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పనుల ప్రగతిని నాడు-నేడు విధానంలో అధికారులకు, పాత్రికేయులకు ప్రాజెక్ట్ సైట్‌లో పర్యటించి సోమవారం తెలియజేశారు. అనంతరం ప్రాజెక్ట్ సమావేశపు హాలులో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ మాజీ సిఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో వేగవంతమైన పోలవరం పనులను ఆయన కుమారుడు సిఎం జగన్ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని, ప్రాజెక్ట్ పనులపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాములులు, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్ ఛానెల్, స్పిల్ వే పూర్తి చేయకుండా గోదావరి నీళ్లు మళ్లించకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించడమే చంద్రబాబు చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు. దీని కారణంగానే 2019-20లో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ఈ జాతీయ ప్రాజెక్ట్‌ను తాను నిర్మిస్తానని ఎందుకు ఒప్పుకున్నారని, 2018లో పూర్తిచేసి జాతికి అంకితం చేస్తానని చెప్పి ఎందుకు పూర్తి చేయలేక పోయారని, కాపర్ డ్యాములు పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు నిర్మించారని చంద్రబాబును ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ 45.72 కాంటూరుకే నిర్మిస్తామని, 41.15 తగ్గిస్తామని ప్రచారంలో నిజం కాదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో మూడు దశలుంటాయని, మొదటి దశలో 41.15 కాంటూరు వరకూ నిర్మించి నీటి నిల్వచేసి పరిశీలిస్తామని, ఏమైనా సమస్యలుంటే గుర్తించి సరిచేస్తామన్నారు. అనంతరం రెండో దశలో కూడా అదేవిధంగా పరిశీలిస్తామన్నారు. చివరిగా 45.72 కాంటూరుతో ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ 194 టిఎంసిల నీటిని నిల్వ చేసే సామర్థ్యం గలదన్నారు. 56 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకుంటుందన్నారు. ఇప్పటివరకు అత్యధికంగా 36 లక్షల క్యూసెక్కుల వరద నీరు 2016లో నమోదైందన్నారు. 41.15 కాంటూరు వరకూ 119 టిఎంసిల నిల్వ సామర్థ్యం ఉంటుందన్నారు. 2017-18 రేట్ల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.55 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. 41.15 కాంటూర్ వరకూ 20,946 కుటుంబాల వారు నిరాశ్రయులవుతారని, వారికి పునరావాసం కల్పించాలన్నారు. 45.72 కాంటూరుకు మరో 16,642 కుటుంబాలు నిరాశ్రయులవుతారని, వారికీ పునరావాసం కల్పించాల్సి ఉంటుందన్నారు. మంత్రివెంట పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ ఆదిత్య, ఇఎన్‌సి నారాయణరెడ్డి, సిఇ సుధాకర్‌బాబు, ఎస్‌ఇ నరసింహమూర్తి ఉన్నారు.










