గుంటూరుజిల్లా ప్రతినిధి: పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షోభంలోకి నెట్టాయని జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన గుంటూరులోని జనచైతన్య వేదిక హాల్లో పోలవరం ప్రాజెక్టు పురోగతి పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. వ్యవసాయ, నీటిపారుదల నిపుణులు అక్కినేని భవానీ ప్రసాద్ ప్రసంగిస్తూ బచావత్ అవార్డులో ప్రకటించిన విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలన్నారు. 150 అడుగుల ఎత్తును తగ్గించే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. లక్ష మందికి పైగా ఉన్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పూర్తి నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రముఖ సామాజిక విశ్లేషకులు టి. లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ2014-2019 మధ్యనాటి ప్రభుత్వం పోలవరం పై 11,450 కోట్లు వెచ్చిస్తే నేటి ప్రభుత్వం గత 50 నెలలలో 4450 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. నిర్వాసితులకు పునరావాస కల్పన కోసం 33 వేల కోట్లు చెల్లించాలని ఇప్పటివరకు 7000 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. నిర్వాసితుల్లో 55 శాతం గిరిజనులు ఉన్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు త్వరతగతిన అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై నేటి ప్రభుత్వం ఒత్తిడి తేలేకపోతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాలని వెంటనే హైదరాబాదు నుండి రాజమండ్రి కి మార్చాలన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ పోలవరం ప్రాజెక్టు అమలుకు మించిన సంక్షేమ కార్యక్రమం మరొకటి లేదన్నారు. కోట్లాది ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే జీవనాడి పోలవరం అని వివరించారు. అఖిలభారత పంచాయితీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, బి సీ మహాజన సభనేత ఉగ్గం సాంబ శివరావు, చరిత్ర అధ్యాపకులు డాక్టర్ పి పోతురాజు, తెలుగు అధ్యాపకులు డాక్టర్ బి.సింగారావు ప్రసంగించారు.










