- ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య
ప్రజాశక్తి-వత్సవాయి: మండలంలోని పోలంపల్లి గ్రామంలో గురువారం రాజీవ్ మునేర్ చెక్‌డ్యామ్‌ను ఎపి రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ పోలంపల్లి చెక్‌డ్యామ్‌కు 20 అడుగుల లోతులో మూడు గండ్లు పడ్డాయని వాటిని వెంటనే పూడ్చాలన్నారు. ప్రథమ దశలో బ్రిటిష్ వారు కట్టిన గోడ నాలుగు అడుగులు సుమారు 20 మీటర్ల పొడవున వరదలకు కొట్టుపోయిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు మిర్చి, పత్తి, వరి నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, నాట్లు పడాలంటే నీటి నిలువ సామర్థ్యం పెంచాలని డిమాండ్ చేశారు. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు వరకు కూడా నీరు వెళ్లడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందిచకుంటే మునేరు ఆయకట్టు కింద ఉన్న మూడు మండలాల రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి చనమోలు సైదులు, సీనియర్ నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు, జిల్లా కమిటీ సభ్యులు మండపూడి చంద్రశేఖర్, నాయకులు తమ్మినేని రాంబాబు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తమ్మినేని రమేష్, కంచర్ల కొండయ్య, బి.రాము కోటేశ్వరావు, ఏసుపోగు వెంకటరత్నం, తులసి అప్పారావు, రాయల వెంకటేష్, మాడుగుల నాగేశ్వరరావు, కందుల జానకోటయ్య, ధారా నాగేశ్వరరావు, అంకుల్ తదితరులు పాల్గొన్నారు.










