Jan 08,2023 21:56

ప్రజాశక్తి - ఏలూరు
          ఎస్‌ఆర్‌.పోలిశెట్టి, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోలిశెట్టి వర్థంతి సభ, సావిత్రిబాయి పూలే జయంతి సభ యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.రవికుమార్‌ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యారంగ వికాసం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఉద్యోగం కంటే ఉద్యమ బాటే ముఖ్యమని నమ్మి తన జీవితాన్ని త్యాగం చేసిన ఎస్‌ఆర్‌.పోలిశెట్టి మనకు ఆదర్శమని కొనియాడారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలు చదువుకోవటం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని భావించి మహిళల చదువు కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలేను అందరూ స్మరించుకోవాలని కోరారు. పాఠశాలల విలీనం పేరుతో పాఠశాలల సంఖ్య తగ్గించడం, ఉపాధ్యాయులను కుదించడం ద్వారా విద్య ప్రయివేణీకటికరణ వైపు వెళుతుందని విమర్శించారు. అదే జరిగితే పేదలు చదువుకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలిశెట్టి, పూలే స్ఫూర్తితో ప్రజలందరికీ విద్య సమాన అవకాశాలు కల్పించడానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి.శ్యాంబాబు, సహాధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు, బి.సుభాషిణి, కోశాధికారి ఎస్‌కె.ముస్తఫా అలీ, కార్యదర్శులు బి.అనురాధ, పివి.సాగర్‌ బాబు, ఎ.రాజు, ఎంవి.అప్పారావు, జి.రాజేంద్రప్రసాద్‌, బివి.రవీంద్ర, బి.బాలకృష్ణ, ఎస్‌.సుధారాణి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు వి.కనకదుర్గ, విబివిఎస్‌.సుబ్రహ్మణ్యం, పి.శ్రీనివాస్‌, నున్న ఆంజనేయులు, ఆడిట్‌ కన్వీనర్‌ ఎంవి.బేతాళరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.