పోలింగ్ ప్రశాంతం
- పట్టభద్రులు 77 శాతం, ఉపాధ్యాయులు 94 శాతం నమోదు
- ఆత్మకూరులో స్వల్ప ఉద్రిక్తత
- పగిడ్యాలలో దొంగ ఓటు వేసేందుకు యత్నం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/నంద్యాల కలెక్టరేట్
నంద్యాల జిల్లాలో సోమవారం నిర్వహించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తరువాత కాస్త ఊపందుకుంది. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల కోసం 61 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 30 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. 54,929 మంది పట్టభద్రుల్లో 42,310 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 30,241 మంది పురుషులు, 12,068 మంది స్త్రీలు, ఒకరు ఇతరులు ఓటు వేశారు. 77.03 శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 4,426 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,631 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2,631 మంది పురుషులు, 1,530 మంది స్త్రీలు ఓటు వేశారు. 94.01 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల ఓటింగ్ కోసం సాయంత్రం పోటెత్తడంతో 4 గంటలకు క్యూలైన్‌లో ఉన్న వారికి టోకన్లను పంపిణీ చేసి పోలింగ్‌ను కొనసాగించారు.
ఆత్మకూరులో స్వల్ప ఉద్రిక్తత
ఆత్మకూరు పట్టభద్రుల పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వైసిపి నాయకులు యథేచ్ఛగా తిరుగుతున్నారని టిడిపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లోపల ఉన్న వైసిపి నాయకులందరినీ బయటకు పంపించేశారు.
పోలింగ్ సరళి పరిశీలన : కర్నూలు కంట్రోల్ రూం నుంచి స్థానిక సంస్థల పోలింగ్ సరళిని ఎన్నికల పరిశీలకు ఎంఎం నాయక్ పరిశీలించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఆరు ఆర్డీవో కార్యాలయాల్లో జరుగుతున్న పోలింగ్‌ను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ అంశంపై కలెక్టర్, జెసిని అడిగి తెలుసుకున్నారు. నంద్యాల కంట్రోల్ రూము నుంచి కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జెసి నిశాంతి, డిఆర్‌ఒ పుల్లయ్య పర్యవేక్షించారు.
స్థానిక సంస్థ స్థానానికి 96.43 శాతం..
ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి జిల్లాలోని నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్‌డిఒ కార్యాలయాల్లో పోలింగ్ నిర్వహించారు. నంద్యాల జిల్లాలో 578 మంది ప్రజాప్రతినిధులకు గాను 557 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 95.37 శాతం పోలింగ్ నమోదైంది. నంద్యాల డివిజన్ బ్యాలెట్ బాక్సులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఆత్మకూరు డివిజన్ బాక్సులను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, డోన్ డివిజన్ బాక్సులను సుధా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు.










